అతి త్వరలోనే నూతన జాతీయ విద్యా విధానం అందుబాటులో ఉంటుందని మానవ వనరులశాఖ తెలిపింది. దీని వల్ల దేశంలో ఉన్న విద్యావ్యవస్థను అమలు చేసే విధానంలో మార్పు వస్తుందని పేర్కొంది.
విద్యార్థులు, విద్యావ్యవస్థల అభివృద్ధికి ఈ నూతన జాతీయ విద్యా విధానం ఎంతో దోహదపడుతుందని మానవ వనరులశాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
స్వచ్ఛ క్యాంపస్ ర్యాంకింగ్స్...
దిల్లీలోని ఏఐసీటీఈలో స్వచ్ఛ క్యాంపస్ ర్యాంకింగ్స్ 2019 అవార్డు ప్రదా నోత్సవ వేడుకలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేడుకలో పాల్గొన్న మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్... ప్రతిరోజూ లీటరు నీటిని ఆదా చేసేందుకు విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఇదే పద్ధతిని తమ సన్నిహితులకూ సూచించాలని తెలిపారు.
స్వచ్ఛ క్యాంపస్ ర్యాంకింగ్స్ ప్రకటించడం ఇది వరుసగా మూడోసారి. 2019కి గానూ దాదాపు 7వేల ఉన్నత విద్యాసంస్థలు పాల్గొన్నాయి. వాటిల్లో 52.. స్వచ్ఛ-స్మార్ట్ క్యాంపస్, వన్ స్టూడెంట్ వన్ ట్రీ, జల్ శక్తి అభియాన్, సౌర శక్తి దీపం విభాగాల్లో అవార్డులు దక్కాయి.
స్వచ్ఛ క్యాంపస్ అవార్డులు దక్కించుకున్న విశ్వవిద్యాలయాల్లో... కోనేరు లక్ష్మయ్య విద్యాసంస్థ(గుంటూర్-రెసిడెన్షియల్), ఐఐహెచ్ఎమ్ఆర్ విశ్వవిద్యాలయం(రాజస్థాన్-నాన్ రెసిడెన్షియల్), ఎస్ఆర్ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(చెన్నై), డా.ఏపీజే అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్శిటి(లఖ్నవూ- నాన్ రెసిడెన్షియల్) అగ్రస్థానాల్లో ఉన్నాయి.