నేటి నుంచి అమలులోకి కొత్త మోటారు వాహనాల చట్టం మోటారు వాహనాల చట్టం- 2019 నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రహదారి భద్రత, రవాణా వ్యవస్థ బలోపేతం, సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ నూతన సవరణలతో ఈ చట్టాన్ని రూపొందించారు.
శిక్ష-జరిమానా
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పాలనా పరమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా జరిమానాలు భారీగా పెరగాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 500 రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష విధించే నిబంధనలు అమలవుతాయి.
కొత్త జరిమానాలు ఇవే..
- లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500లు ఉండే జరిమానాను రూ.5వేలకు పెంచారు.
- అతివేగంగా వాహనం నడిపితే రూ.400ల నుంచి రూ.1000కు పెంచారు.
- ప్రమాదకర డ్రైవింగ్ చేస్తే రూ.1000 వరకు ఉన్న జరిమానాను...రూ.5వేలకు పెంచేశారు.
- మద్యం తాగి వాహనం నడిపితే రూ.2వేలు ఉంటే దాన్ని రూ.10వేలకు పెంచారు.
- అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేల వరకు జరిమానా కట్టాలి.
- సీటు బెల్టు లేకుండా వాహనం నడిపితే రూ.100 నుంచి రూ.1000కి పెంచారు.
- అధిక లోడుకు రూ.20వేలు జరిమానా వసూలు చేస్తారు.
తెలంగాణలో ఆలస్యం
తెలంగాణలో ఈ చట్టం అమలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. జరిమానాల విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత ఓ నిర్ణయానికి రావాలని సర్కారు యోచిస్తోంది. అయితే కొన్ని కేసుల్లో కేంద్రం నిబంధనలను అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఇదీ చూడండి: ట్రాఫిక్ ఉల్లం'ఘను'లకు మరో 10 రోజుల తర్వాత వాతే!