తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అవి కార్మికుల రక్షణ వలయాన్ని తొలగించే బిల్లులు' - లేబర్ కోడ్​లపై కాంగ్రెస్

కార్మిక చట్టాలను ఏకీకృతం చేసే బిల్లులపై కాంగ్రెస్ పెదవి విరిచింది. వీటిని కార్మిక వ్యతిరేక చట్టాలని విమర్శించింది. ఈ చట్టాల వల్ల సులభతర వ్యాపారం పెరుగుతుందన్న కేంద్రం వాదన పూర్తిగా అవాస్తవమని ఆరోపించింది. వీటికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

New labour codes have 'weakened' trade unions, removed 'security net' for workers: congress
'అవి కార్మికుల రక్షణ వలయాన్ని తొలగించే బిల్లులు'

By

Published : Sep 26, 2020, 4:45 PM IST

పార్లమెంట్ ఆమోదించిన మూడు లేబర్ కోడ్​లను కార్మిక వ్యతిరేక చట్టాలుగా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. ఈ చట్టాలు ట్రేడ్ యూనియన్లను బలహీనపరిచాయని ఆరోపించింది. కార్మికుల రక్షణ వలయాన్ని ఈ చట్టాలు తొలగించాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి-మూడు కార్మిక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం

ఈ చట్టాల వల్ల సులభతర వ్యాపారం పెరుగుతుందన్న కేంద్రం వాదన పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కార్మిక మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ చట్టాలతో రాష్ట్రాల అధికారాలను కేంద్రం స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. శ్రామిక వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలపై నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

"కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం చాలా ముఖ్యం. అన్ని పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకించాలి. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తుల మాటలే వింటుంది. ఈ చట్టాలు తయారు చేసిన తర్వాత ట్రేడ్ యూనియన్ల మాటలు ప్రభుత్వం పట్టించుకోదు."

-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు

మోదీ ప్రభుత్వం అన్ని రంగాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖెరా అన్నారు. ఒకదాని తర్వాత మరో రంగాన్ని మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ఇటీవలే అన్యాయం జరిగిందని.. ఆ సమస్య కొనసాగుతున్న తరుణంలోనే కార్మికులకు వెన్నుపోటు పొడిచిందన్నారు.

"సులభతర వాణిజ్యం మెరుగుపడుతుందన్న నెపంతో ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. అందరికీ ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. కానీ, చట్టంలో కార్మికుల రక్షణ, వారికి ఉపశమనం కలిగించే అంశాలు లేవనేది స్పష్టంగా తెలుస్తోంది. లాక్​డౌన్ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వలస కార్మికుల కోసం ఇందులో ఎలాంటి నిబంధనలు చేర్చలేదు."

-పవన్ ఖెరా, కాంగ్రెస్ ప్రతినిధి

ఈ చట్టాలను హడావుడిగా పార్లమెంట్​ ఆమోదం పొందేలా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు ఖెరా. ప్రజాస్వామ్య నిబంధనలను గాలికి వదిలేసి, సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దడం ప్రభుత్వ డీఎన్​ఏలోనే ఉందని విమర్శించారు.

రైతుల రక్షణ, భద్రతకు సంబంధించి బిల్లులలో ఎలాంటి నిబంధనలు లేవని భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీ సంజీవ రెడ్డి అన్నారు. దీనిపై పోరాడతామని చెప్పారు. పెట్టుబడి దారులకు, కార్పొరేట్ వ్యక్తుల కోసమే వీటిని తీసుకొచ్చారని అన్నారు. నూతన నిబంధనల ప్రకారం కార్మికులు సమ్మెలు కూడా చేయలేరని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details