జమ్ముకశ్మీర్ చరిత్రలో ఈ అర్ధరాత్రి నుంచి సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్రపతి పాలన రద్దయింది. ఇప్పటి వరకు లద్దాఖ్‌తో కలిపి జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని చూసిన దేశ ప్రజలు.. ఇప్పటి నుంచి రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా చూస్తారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశం.. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో 'నవ భారతం'గా రూపుదిద్దుకుంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణానికి ముగింపు పలికి.. భారత చట్టంలో సరికొత్త 'కశ్మీరం' వెల్లివిరిసింది.
దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ అంశంపై మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5న సంచలన నిర్ణయం తీసుకుని.. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో.. జమ్ముకశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయాయి. భారత మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ అర్ధరాత్రి నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చింది.
72 ఏళ్ల ప్రత్యేక ప్రతిపత్తికి ముగింపు
1947 అక్టోబర్ 24 నుంచి దాదాపు 72 ఏళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తితో ఉన్న కశ్మీర్‌ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానం చేస్తూ.. ఆగస్టు 5న నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370,35ఏ రద్దుతో పాటు జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం కశ్మీర్లో మరిన్ని మార్పులు జరగనున్నాయి. అవేంటంటే..