తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం' - kashmir today news

ఆర్టికల్​ 370 రద్దు.. మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పాటు పునర్విభజన బిల్లు ఆగస్టులోనే పార్లమెంట్ ఆమోదం తెలిపినా.. నేడే అమల్లోకి వచ్చింది. ఫలితంగా జమ్ముకశ్మీర్‌ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయాయి. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారత చిత్రపటం సరికొత్తగా రూపుదిద్దుకుంది.

అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం'

By

Published : Oct 31, 2019, 12:01 AM IST

జమ్ముకశ్మీర్‌ చరిత్రలో ఈ అర్ధరాత్రి నుంచి సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు లద్దాఖ్​తో కలిపి జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని చూసిన దేశ ప్రజలు.. ఇప్పటి నుంచి రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా చూస్తారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశం.. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో 'నవ భారతం'గా రూపుదిద్దుకుంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణానికి ముగింపు పలికి.. భారత చట్టంలో సరికొత్త 'కశ్మీరం' వెల్లివిరిసింది.

దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్‌ అంశంపై మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5న సంచలన నిర్ణయం తీసుకుని.. ఆర్టికల్​ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్​లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో.. జమ్ముకశ్మీర్‌ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయాయి. భారత మొట్టమొదటి హోంమంత్రి సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా ఈ అర్ధరాత్రి నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చింది.

అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం'

నేడే లెఫ్టినెంట్​ గవర్నర్ల ప్రమాణం

లేహ్​లో ఇవాళ ఉదయం 7 గంటల 15 నిమిషాలకు లద్దాఖ్‌ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌, అనంతరం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శ్రీనగర్‌లో.. జమ్ముకశ్మీర్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్ముకశ్మీర్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ గీతా మిత్తల్​ ఈ ఇద్దరితో ప్రమాణం చేయిస్తారు.

72 ఏళ్ల ప్రత్యేక ప్రతిపత్తికి ముగింపు

1947 అక్టోబర్​ 24 నుంచి దాదాపు 72 ఏళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తితో ఉన్న కశ్మీర్​ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానం చేస్తూ.. ఆగస్టు 5న నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్​ 370,35ఏ రద్దుతో పాటు జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్​ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం కశ్మీర్​లో మరిన్ని మార్పులు జరగనున్నాయి. అవేంటంటే..

⦁ రెండు రాష్ట్రాలకు వేర్వేరు లెఫ్టి​నెంట్​ గవర్నర్లు ఉంటారు.
⦁ ప్రస్తుతం జమ్ముకశ్మీర్​లోని ఐఏఎస్​, ఐపీఎస్ అధికారులు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ యధాతథంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ​⦁ రెండు ప్రాంతాల్లోని ఐఏఎస్​, ఐపీఎస్, ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ) అధికారులతో పాటు ఇతర కేంద్ర విభాగ అధికారులు లెఫ్టినెంట్​ గవర్నర్​ ఆధీనంలో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీరిపై ఎలాంటి అధికారం ఉండదు.

చివరి ముఖ్యమంత్రి, గవర్నర్​ వీరే

ఉమ్మడి జమ్ముకశ్మీర్​కు చివరి ముఖ్యమంత్రి, గవర్నర్​గా మెహబూబా ముఫ్తీ, సత్యపాల్​ మాలిక్​ బాధ్యతలు నిర్వర్తించారు.
ఒక రాష్ట్రం.. కేంద్ర పాలిత ప్రాంతంగా మారడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇదీ చూడండి : త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్

ABOUT THE AUTHOR

...view details