కరోనా లక్షణాలున్న వారు స్వీయ నిర్బంధంలో ఉండి ఇంటి నుంచే చికిత్స తీసుకునేలా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. సంప్రదించాల్సిన వైద్య అధికారులు, కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.
మర్గదర్శకాలు ఇవే...
- వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తికి ఇంట్లో ప్రత్యేక గది, శౌచాలయం సదుపాయం ఉంటే ఆస్పత్రికి వెళ్లనవసరం లేదు.
- వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి తెలియజేయాలి.
- వైద్య సిబ్బంది మీకు సాయం చేసేందుకు అందుబాటులో ఉంటారు.
- వైద్య అధికారి సూచనలు, నిబంధనల మేరకు లక్షణాలున్న వ్యక్తికి సహాయకారిగా ఉండే వారికి ముందు జాగ్రత్త చర్యగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వాలి.
- లక్షణాలున్న వ్యక్తి బాగోగులు చూసుకునే వారు 24x7 వైద్య అధికారులకు అందుబాటులో ఉండాలి.
- స్వీయ నిర్బంధంలో ఉన్నన్ని రోజులు సంరక్షకులు ఎల్లవేళలా ఆస్పత్రితో సంబంధాలు కలిగి ఉండాలి.
- ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు పొందుపర్చాలి. దానిని ఎప్పుడూ యాక్టివ్‌లోనే ఉంచాలి.
- లక్షాణాలు ఉన్న వ్యక్తికి వైరస్ తీవ్రత ఎక్కువైనా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా, ఛాతిలో ఒత్తిడిగా ఉన్నా వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయాలి.
- కరోనా లక్షణాలు అసలు లేవని వైద్యులు పరీక్షలు నిర్వహించి నిర్ధరించాకే స్వీయ నిర్బంధం ముగుస్తుంది.