గోవా నూతన ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిగంటలకే ప్రమోద్ సావంత్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయమై గవర్నర్ మృదుల సిన్హాకు లేఖ రాశారు సావంత్. శాసనసభ బుధవారం ఉదయం 11గంటల 30 నిమిషాలకు సమావేశం కావాలని గవర్నర్ సమన్లు జారీ చేశారు. "బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్ మృదులా సిన్హాకు మేం రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. బల పరీక్షకు సిద్ధంగా ఉన్నాం. పర్రీకర్ జ్ఞాపకార్థం పనాజిలోని మిరామర్ బీచ్లో స్మారకం నిర్మిస్తాం."
-ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి
భాజపా 11, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్పీ) మూడు, మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) మూడు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 20 మంది ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు.
ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్, భాజపా ఎమ్మెల్యే ఫ్రాన్సిన్ డిసౌజాల మరణం, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుభాష్ షిరోడ్కార్, దయానంద్ సోప్తే రాజీనామాలతో గోవా శాసనసభ సభ్యుల సంఖ్య 40 నుంచి 36కు పడిపోయింది. రాష్ట్రంలో 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సైతం సభలో ఉన్నారు.
ఇదీ చూడండి:"పార్టీ పెద్ద బాధ్యతను అప్పగించింది"