నష్టాల బారిన పడిన ప్రభుత్వరంగ టెలికం సంస్థల భవిష్యత్తు ఏమిటి? పునరుజ్జీవం కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికలు ఫలితాల్ని ఇస్తాయా, భారీస్థాయిలో సాగే ఈ కసరత్తు బూడిదలో పోసే పన్నీరే అవుతుందా, కొత్త జీవం పోసుకుని మార్కెట్‌లో పోటీ పడతాయా... ఇప్పుడీ ప్రశ్నలన్నీ చర్చనీయాంశాలుగా మారాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎమ్‌టీఎన్‌ఎల్) సంస్థల్ని విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే చాలా ఆలస్యమైందనే భావన నెలకొంది.
ఇది రెండు సంస్థల పునరుత్తేజానికి దోహదపడకున్నా, ప్రైవేటు సంస్థలకు కొంతమేర పోటీని సృష్టిస్తుండవచ్చని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే భారీ సంస్కరణలకు, పూర్తిస్థాయిలో పునర్నిర్మాణ ప్రక్రియకు తెరతీసి ఉండాల్సింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రస్తుత చర్యలు ఈ సంస్థల్ని గాడిన పెట్టేందుకు సరిపోవు. ఈ రెండు సంస్థలు నిర్వహణ పరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రతిపాదిత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) ప్యాకేజీతోపాటు రెండింటి విలీనం వంటివి నిర్వహణ వ్యయాలకు కొంతమేర అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. అంతేతప్ప, పూర్తిస్థాయిలో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం లేదనే చెప్పాలి.
బీఎస్‌ఎన్‌ఎల్ ఒకప్పుడు నవరత్న కంపెనీ. తరవాతి కాలంలో రూ.90 వేలకోట్ల నష్టాల బారిన పడటంతో ఖాయిలా బాట పట్టింది. ఫలితంగా, రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి సమర్థ ప్రైవేటు సంస్థలతో పోటీ పడలేకపోయింది. 1.76 లక్షల మంది ఉద్యోగశక్తి ఉన్నా బరిలో నిలవలేక చతికిలపడింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌లోని ఉద్యోగులు ఆ సంస్థలు మార్కెట్‌లో ఆధిపత్యం చలాయించిన రోజులనాటికి చెందినవారు కావడమే అతిపెద్ద సమస్య అని టెలికం రంగ నిపుణుల అభిప్రాయం.
ప్రస్తుత కాలంలో నెలకొన్న అతి తీవ్ర పోటీ వాతావరణానికి అనుగుణంగా సంస్థలు తమ వైఖరిని మార్చుకోవడంలో విఫలం కావడమే పెద్ద సమస్యగా చెబుతున్నారు. క్షీణతకు ప్రధాన కారణాల్లో ఇదొకటని స్పష్టం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల రంగంలో తీవ్ర పోటీ కారణంగా ధరలు తగ్గడం, సిబ్బందికయ్యే వ్యయం అధికంగా ఉండటం, డేటా ఆధారిత టెలికం విపణిలో కొన్నిచోట్ల తప్పించి 4జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురాలేకపోవడం... వంటివన్నీ బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలకు ప్రధాన కారణాలు.
2016లో జియో అత్యంత దూకుడుగా మార్కెట్‌లోకి ప్రవేశించడంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయాలకు భారీగా గండి పడింది. జియో తన తగ్గింపు ధరలు, దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌తో టెలికం పరిశ్రమను కుదిపేసింది. 2016 ద్వితీయార్ధం నుంచి జియో 4జీ సేవలతో మొబైల్ ఫోన్లలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా జియో ప్రవేశం తరవాత అప్పటికే ఉన్న సంస్థల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా టెలికం రంగంలోని సంస్థలు ఏకీకరణ దిశగా అడుగులు వేయక తప్పలేదు. ఇప్పుడు, బీఎస్‌ఎన్‌ఎల్/ ఎమ్‌టీఎన్‌ఎల్ కాకుండా, వివిధ సంస్థల విలీనాల అనంతరం ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా వంటి మూడు ప్రైవేటు సంస్థలు మాత్రమే మిగిలాయి.
ఆర్థికాభివృద్ధికి అవసరం...
ప్రభుత్వరంగ టెలికం సంస్థల్ని ప్రస్తుత పోటీ విపణిలో నిలబెట్టేందుకు బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌లను విలీనం చేయడంతోపాటు, 4జీ స్పెక్ట్రమ్ కోసం రూ.20,140 కోట్లు, వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) కోసం రూ.3,674 కోట్ల పెట్టుబడి సాయం, రూ.15 వేల రుణ సమీకరణకు ప్రభుత్వ హామీ, సిబ్బంది వీఆర్‌ఎస్‌కు రూ.12,768 కోట్లు, పదవీ విరమణ బాధ్యతలకు మరో రూ.17,160 కోట్లు, ఆస్తుల అమ్మకం ద్వారా రూ.38 వేలకోట్ల సముపార్జన, వచ్చే నాలుగేళ్ల కాలానికి ఉద్యోగులకు వీఆర్‌ఎస్ వంటి చర్యల్ని పునరుజ్జీవన ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ప్రకటించింది.
స్థూలంగా చూస్తే రెండు సంస్థల్ని కలిపేయడం హేతుబద్ధంగానే అనిపిస్తుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు, ఆర్థికంగా అంతగా లాభసాటికాని ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టే విషయంలో ప్రైవేటు ఆపరేటర్లను వాటి బ్యాలెన్స్‌షీట్లు వెనక్కి లాగుతుంటాయి. అందువల్ల ఒక బలమైన ప్రభుత్వరంగ సంస్థ రంగంలో ఉంటే, అది ప్రైవేటు కంపెనీల ధరల పెరుగుదలను నిరోధించడమే కాకుండా, గ్రామీణ వినియోగదారుల గురించీ పట్టించుకునేలా చేస్తుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సురక్షితంగా, భద్రంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వర్తించే బలమైన ప్రభుత్వరంగ టెలికం సంస్థల అవసరం ఎంతైనా ఉంది. 2018లో ప్రారంభించిన జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ (ఎన్‌డీసీపీ)లో టెలికమ్యూనికేషన్ల విభాగం- మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, రేడియో స్పెక్ట్రమ్ నిర్వహణ, జాతీయ టెలికం మౌలిక సదుపాయాలకు భద్రత పెంచడం, నెట్ న్యూట్రాలిటీ నియమాలకు కట్టుబడి ఉండటం వంటివి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంశాలుగా గుర్తించింది.