దేశంలో కొత్త జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ముసాయిదా కోసం ఈ నెలాఖర్లో ఓ కమిటీని నియమించనుంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ). 14 ఏళ్ల నుంచి అమలులో ఉన్న ప్రస్తుత జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా విధానాన్ని కమిటీ పరిశీలించి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నెల చివర్లో కమిటీ... జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదాను (ఎన్సీయఫ్)ను పునఃపరిశీలించి కొత్త విధానం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనుందని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రుశికేష్ సేనాపతి తెలిపారు. కొత్త విద్యా విధానంలో భాగంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణాత్మక, ఆవిష్కరణ, విశ్లేషణ-ఆధారిత, అందరికీ అర్థమయ్యే రీతిలో అభ్యాస శైలి ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.
'కొత్త విద్యా విధానం తుది ముసాయిదా కోసం ఎదురు చూస్తున్నాం. ఈ నెల చివర్లో కమిటీ నివేదికను సమర్పిస్తుంది. నివేదిక ప్రకారం కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఆ కొత్త పాఠ్యప్రణాళిక ప్రకారమే నూతన పుస్తకాలను తీసుకొస్తాం.''