ఆగస్టు 5... దేశ చరిత్రలో అతి కీలకమైన రోజు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ.. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన రోజు.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో తలెత్తే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన వ్యూహం అమలు చేసింది కేంద్రం. ఫలితంగా 5 నెలలుగా కశ్మీర్ ఆంక్షల వలయంలో ఉంది. పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది ప్రభుత్వం. తాజాగా అంతర్జాల సేవలను పాక్షికంగా పునరుద్ధరించింది. అయితే ఆ సేవలను కొన్ని సంస్థాగత అవసరాల కోసమే అందుబాటులోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది.
కశ్మీర్లో భద్రతాపరంగా ఇలాంటి చర్యలు చేపట్టడం కొత్తకాదు. ఇవన్నీ దేశ అంతర్గత భద్రతకు సంబంధించినవి. అయితే.... ఇటీవల కాలంలో కేంద్రప్రభుత్వ వైఖరిలో మాత్రం కీలక మార్పు వచ్చింది. ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలు పెద్దగా పట్టించుకోని మోదీ సర్కార్... ఈ మధ్య కాలంలో మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
దౌత్యవేత్తల పర్యటన
జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు విదేశీ దౌత్యవేత్తల పర్యటనను నిర్వహించింది భారత ప్రభుత్వం. కశ్మీర్ లోయలోని వివిధ వర్గాల వారిని కలిసేందుకు అనుమతిచ్చింది. అమెరికాతో పాటు మాల్దీవులు, వియత్నాం, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, మొరాకో, నైజీరియా, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్‌ను సందర్శించారు.
అయితే ఎంపిక చేసిన పాత్రికేయులు, రాజకీయ నేతలు, పౌర సంఘాల కార్యకర్తలను కలిసేందుకే దౌత్య వేత్తలకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఊహించినట్టుగానే కశ్మీర్‌లోని ప్రముఖ రాజకీయ నేతలు, నిర్బంధంలో ఉన్న నేతలను కలిసేందుకు వారికి అవకాశం లభించలేదు. విదేశీ ప్రతినిధులు కలిసిన వారందరూ కశ్మీర్ నిర్ణయాన్ని సమర్థించినవారే. వీరిలో చాలామంది 5 నెలల కాలంలో ఎలాంటి ఘర్షణ తలెత్తలేదని చెప్పినవాళ్లే కావటం గమనార్హం.
జమ్ము కశ్మీర్లో కేంద్రమంత్రుల పర్యటన ఉంటుందని ఇటీవల ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ప్రకటన చేశారు. స్థానిక ప్రజలను కలిసి అధికరణ 370 రద్దు ప్రయోజనాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం చేయాలనుకున్న అభివృద్ధి గురించి వివరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎందుకు?
కశ్మీర్లో పరిస్థితులను చూస్తే ఈ చర్య చాలా అవసరం. ఇటీవల జరిగిన దౌత్యవేత్తల పర్యటనతో పాటు కేంద్ర మంత్రుల సందర్శన నిర్ణయాన్ని పరిశీలిస్తే కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
అయితే.. ఈ నిర్ణయాత్మక పర్యటనల వెనుక మర్మమేమిటో అర్థం కావటం లేదు. దౌత్యవేత్తలు ఎవర్ని కలవాలో ప్రభుత్వం నిర్ణయించటం ఎందుకు? అనే ప్రశ్న తలెత్తుతుంది. కశ్మీర్లో విదేశీ ప్రతినిధులు పర్యటిస్తుంటే.. భారత రాజకీయ నేతలు వారిని ఎందుకు కలవకూడదు? అన్నది మరో ప్రశ్న.
ఒకవేళ కశ్మీరీలకు దగ్గరవడమే ప్రభుత్వ లక్ష్యమని అనుకుందాం. అలాగైతే 2010లో భారత వ్యతిరేక అల్లర్ల సమయంలో అఖిలపక్ష ప్రతినిధుల పర్యటన తరహాలో మరో కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించకూడదు?
కశ్మీర్లో పరిస్థితులు అసాధారణంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక విధానాలతో సాధారణ స్థితిని సృష్టిస్తోంది. సహజమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడితేనే లోయలో ప్రశాంతత ఆవరిస్తుంది.
సుప్రీం చొరవతో స్వల్ప ఊరట
కశ్మీర్లో అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఇంటర్నెట్ సేవల రద్దు అక్రమమని గత వారం సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఆంక్షల నుంచి కశ్మీరీలకు స్వల్ప ఊరట లభించింది. ఇంటర్నెట్ సేవలు పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి.