బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకున్న వేళ.. 6 పార్టీలతో కొత్త కూటమి(ఫ్రంట్) గురువారం ఏర్పాటైంది. ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి, ప్రధాన ప్రతిపక్షాలతో కూడిన 'మహాకూటమి' ఎన్నికల బరిలో ఉన్నాయి. తాజాగా 'గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్' పేరిట మరో కూటమిని ఏర్పాటు చేసినట్లు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వహ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలు ప్రకటించారు. ఈ కూటమికి దేవేంద్ర యాదవ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉపేంద్ర కుష్వహ తెలిపారు.
"ఎన్నికల్లో కొత్త కూటమికి ప్రజలు పట్టం కడితే ఉపేంద్ర కుష్వహ ముఖ్యమంత్రి అవుతారు. కొత్త కూటమి ద్వారా బిహార్ ప్రజలకు మేము ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నితీశ్ కుమార్ 15 ఏళ్ల పాలనలో బిహార్ ప్రజలు మోసపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రత్యామ్నాయం అవసరం"
-- అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత
కొత్త కూటమిలో ఆర్ఎల్ఎస్పీ, ఏఐఎంఐఎంలతో పాటు బీఎస్పీ, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ జనతాదళ్(డెమొక్రాటిక్), జన్‌తాంత్రిక్ పార్టీ(సోషలిస్ట్)లు భాగస్వామ్యం వహిస్తున్నాయి.
ప్రచారానికి ఉద్ధవ్ ఠాక్రే
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు బిహార్‌లో ప్రచారం చేయనున్న 22 మంది పార్టీ నేతల జాబితాను శివసేన గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు సంజయ్ రౌత్ తదితరులున్నారు. బిహార్‌లో దాదాపు 50 స్థానాల్లో శివసేన పోటీకి దిగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.