భారత్- నేపాల్ మధ్య బ్రిటీష్ కాలం నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. దశాబ్దాలుగా సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, వాణిజ్య సంబంధాలతో పెనవేసుకుపోయాయి. నేపాల్‌తో భారత్‌కున్న ఇలాంటి ప్రత్యేక బంధం మరే దేశంతోనూ లేదు. కానీ, కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. సరిహద్దు ప్రాంతాలపై ఎన్నడూ లేనంతగా నేపాల్ స్పందిస్తోంది. భారత భూభాగంలోని కాలపానీ, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను కలుపుకొని కొత్త జాతీయ పటాన్ని రూపొందించింది.
కాఠ్మాండూ వైఖరిలో ఒక్కసారిగా ఎందుకింత మార్పు? రెండు దేశాల మధ్య ఉన్న చిన్నపాటి స్పర్థలను జటిలం చేయటానికి కారణాలేంటి? దీని వెనుక చైనా హస్తం ఉందా? చైనా ఆర్థిక మద్దతుతో భారత్‌తో నేపాల్ వ్యవహార శైలి మారిందా? ఈ పరిణామాలపై నిపుణులు ఏమంటున్నారు?
చైనా మద్దతు..
తాజా పరిణామాలకు కారణం నేపాల్‌కు చైనా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా అందిస్తోన్న మద్దతుతో నేపాల్‌లో ఆకాంక్షలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు ఇంత సంక్లిష్ట స్థితికి చేరుకునేందుకు రెండు దేశాలు కారణమని నేపాల్‌లో భారత రాయబారిగా పని చేసిన రాకేశ్ సూద్ అన్నారు.
"రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యంత ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇందుకు రెండు దేశాలూ కారణమయ్యాయి. నేపాల్‌తో భారత్ చర్చలు జరపాల్సి ఉంది. గతేడాది నవంబర్‌లో నేపాల్ ప్రతిపాదించిన చర్చలకు భారత్ సమయం కేటాయించాలి. మనం సరైన శ్రద్ధ వహించలేదేమోనని నా భావన. కానీ, నేపాల్ మళ్లీ తిరిగి రానంత లోతుకు తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది. "
- రాకేశ్ సూద్, మాజీ దౌత్య అధికారి
భారత్‌తో నేపాల్‌కు 1,850కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సిక్కిం, బంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. సరిహద్దు ప్రజల స్వేచ్ఛా రవాణా సంప్రదాయంగా కొనసాగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. సుమారు 80 లక్షల మంది నేపాలీ పౌరులు భారత్‌లో జీవిస్తూ ఉపాధి పొందుతున్నారు.
అంతేకాదు, రెండు దేశాల మధ్య దృఢమైన రక్షణ, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నేపాల్‌కు భారతే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2018-19 సంవత్సరంలో రూ.57,858 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. సుమారు 32 వేల మంది నేపాలీ గూర్ఖాలు భారత సైన్యంలో సేవలు అందిస్తున్నారు.
ఓలీ రాజకీయ లబ్ధి..
రాజకీయ ఉద్దేశంతోనే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ నిర్ణయం తీసుకున్నారని 2013-17 మధ్య నేపాల్‌లో దౌత్య అధికారిగా పనిచేసిన రంజిత్ రే అభిప్రాయపడ్డారు. దేశీయ రాజకీయాల్లో సమస్యలను అధిగమించి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకే ఓలీ కొత్త మ్యాపును తీసుకొచ్చారని తెలిపారు.
"భారత్ వ్యతిరేక భావజాలమే ఎన్నికల్లో ఓలీ విజయానికి కారణమైంది. దేశీయంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఓలీకి మళ్లీ ఇదే అంశం సహాయపడుతుందని భావిస్తున్నారు. నేపాల్‌లో ఆయన పదవిపై అభద్రతా భావంతో ఉన్నారని నా అభిప్రాయం.
ఆర్థిక పురోగతి, కరోనా సంక్షోభంలో ప్రభుత్వం విఫలమైందని నేపాల్‌లో చాలా మంది ఆందోళనలు చేస్తున్నారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోనే ప్రధానిగా ఓలీని దించే అవకాశముందని వదంతలు వస్తున్నాయి. నాకు తెలిసి సరిహద్దు అంశమే ఇప్పుడు ఓలీకి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, వివాదాస్పద మ్యాపును రూపొందించి రెండు దేశాల మధ్య సమస్యను మరింత జటిలం చేసింది నేపాల్."
- రంజిత్ రే, నేపాల్‌లో మాజీ దౌత్య అధికారి
1997నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై చర్చలకు నవంబర్‌లో నేపాల్ ప్రతిపాదించింది. అయితే కరోనా సంక్షోభం తర్వాత సిద్ధమని భారత్ జవాబు ఇచ్చింది. అయినప్పటికీ, వివాదాస్పద మ్యాపునకు సంబంధించి నేపాల్ తొందరపడిందని, అంత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సన అవసరం లేదని అన్నారు రంజిత్ రే.