తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా ఆదేశాలతోనే ఆ రహదారిపై నేపాల్ వ్యతిరేకత!

భారత్​ నూతనంగా ప్రారంభించిన లిపులేఖ్ పాస్ రహదారిని వేరొకరి ఆదేశాల ప్రకారమే నేపాల్ వ్యతిరేకిస్తోందని.. చైనానుద్దేశించి వ్యాఖ్యానించారు భారత సైన్యాధికారి ఎం.ఎం. నరవణె. రహదారి నిర్మాణ ప్రాంతంపై ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు.

naravane
నరవణె

By

Published : May 16, 2020, 12:24 PM IST

ఉత్తరాఖండ్​లోని దార్చులా వద్ద భారత్​ నూతనంగా ప్రారంభించిన రహదారిని.. చైనా ఆదేశాలకు అనుగుణంగానే నేపాల్ వ్యతిరేకిస్తోందని భారత సైన్యాధికారి ఎం.ఎం నరవణె వ్యాఖ్యానించారు. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రహదారి ప్రాంతంపై భారత్​, నేపాల్​ మధ్య ఎలాంటి వివాదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు మార్గాన్ని భారతదేశ పరిధిలోనే నిర్మించినట్లు తేల్చిచెప్పారు.

"మహాకాళీ నదికి తూర్పున ఉండే ప్రాంతం తమదని నేపాల్ రాయబారి చెప్పారు. దానిలో ఎలాంటి వివాదం లేదు. నదికి పశ్చిమవైపు రోడ్డు నిర్మాణం జరిగింది. గతంలోనూ దీనిపై ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. వేరొకరి ఆదేశాల మేరకే వారు ఈ సమస్యను లేవనెత్తారని మేం నమ్మడానికి కారణం ఉంది."

- సైన్యాధికారి, ఎం.ఎం నరవణె

లిపులేఖ్ రహదారి..

చైనా సరిహద్దులో అత్యంత కీలకమైన రహదారిని మే 8న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని దార్చులా నుంచి లిపులేఖ్‌ కనుమ వరకు 80 కి.మీ. పొడవున, సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ మార్గం ద్వారా కైలాస్‌-మానస సరోవర్​‌ యాత్రకు తక్కువ సమయం పట్టనుంది. మాన్‌సరోవర్‌ కేవలం 90 కి.మీ దూరమే ఉండటం వల్ల... యాత్ర సమయం మూడు వారాల నుంచి వారంలోనే పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా సైనిక బలగాలను వేగంగా తరలించడానికీ వీలు కలిగింది.

దీనిపై మే 9న నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు భారత్​ తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపించింది. 'ఏకపక్ష చర్య'ని మాట్లాడగా.. ఆ ఆరోపణలను నరవణె ఖండించారు.

చైనా సైన్యంతో ఘర్షణపై

ఇటీవలే భారత్​-చైనా సైన్యాల మధ్య జరిగిన రెండు వేర్వేరు ఘర్షణలపై స్పందించారు జనరల్ నరవణె. ఇరుదేశాల సైన్యాలు సరిహద్దుల్లోని 10 వేర్వేరు ప్రదేశాల వద్ద కలుసుకుంటాయని.. అది సాధారణంగా జరిగే వ్యవహారమని వెల్లడించారు.

భారత్​, చైనాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు మే 5న తూర్పు లద్దాఖ్​లోని పాంగోంగ్ ట్సో ప్రాంతంలో ఘర్షణ పడ్డారు. ఇనుప కడ్డీలు, కర్రలతో దాడి చేసుకోవడం సహా రాళ్లు రువ్వుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ఉత్తర సిక్కింలోని 'నాథులా పాస్​' వద్ద ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.

ద్వంద్వ యుద్ధం!

పొరుగుదేశాల్లో భద్రత స్థితిగతులు అభివృద్ధి చెందడంపై జనరల్ నరవణె మాట్లాడారు. భారతదేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వెంబడి ఒకేసారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. అయితే అన్ని ఘర్షణలు యుద్ధానికి దారితీయవని స్పష్టం చేశారు.

మూడేళ్ల ఆర్మీ శిక్షణపైనా..

పాఠశాల, కళాశాల విద్యార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగానే యువతకు మూడేళ్ల ఆర్మీ శిక్షణ కార్యక్రమానికి నాంది పలికినట్లు జనరల్ నరవణె వెల్లడించారు. ఆర్మీనే శాశ్వత వృత్తిగా ఎంచుకోకుండా.. సైనిక శిక్షణపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిపారు.

కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఆర్మీ వ్యయాలలో కేంద్రం 20 శాతం కోత విధించినట్లు జనరల్ నరవణె స్పష్టం చేశారు. యుద్ధానికి సంసిద్ధంగా ఉండటంపై ఎలాంటి రాజీ పడకుండా వ్యయాలు సమతుల్యం చేసుకుంటున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details