షెడ్యూల్ ప్రకారమే జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
కరోనా సంక్షోభం వేళ నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలను నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఇందుకోసం పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్టు, గదిలో తక్కువ మంది అభ్యర్థులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
"జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను 570 నుంచి 660కు పెంచాం. నీట్ కోసం పరీక్షా కేంద్రాలను 2,546 నుంచి 3,843కి పెంచాం. మెయిన్స్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాగా.. నీట్‌కు పెన్-పేపర్ అవసరం. నీట్ కోసం ఒక గదిలో 24మంది బదులు 12మంది మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల బయట అభ్యర్థులు నిల్చునే సమయంలోనూ భౌతిక దూరాన్ని పాటించేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాం."
---నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
సెప్టెంబర్ 1 నుంచి 6వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. నీట్ సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు.