కరోనా వైరస్ విసురుతున్న సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వైరస్‌పై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, లాక్‌డౌన్ అమలు కారణంగా నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండున్నర గంటలు చర్చించారు. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయం, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లాక్‌డౌన్‌తో ఫలితాలు
కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్రంతో కలిసి చేపట్టిన ప్రయత్నాలు కొంత ప్రభావాన్ని చూపుతున్నట్లు పేర్కొన్నారు ప్రధాని. లాక్‌డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గత నెలన్నరగా లాక్‌డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మోదీ చెప్పినట్లు తెలిసింది. వేలాదిమంది ప్రాణాలను రక్షించే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయని చెప్పారు.
మాస్కులూ భాగమే..
రాబోయే రోజుల్లోనూ కరోనా ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్న ప్రధాని మాస్కులు మన జీవితంలో భాగంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. మార్చిలో కరోనా ప్రభావం అన్ని దేశాల్లో మాదిరే భారత్‌లోనూ ఉన్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. సమయానుకూలంగా తీసుకున్న చర్యలతో ఎంతో మందిని వైరస్ బారినుంచి కాపాడినట్లు చెప్పారు.
ఇంకా ప్రమాదమే..
నిపుణుల అంచనా మేరకు కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉందన్న మోదీ పటిష్టమైన నిఘా చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. వేసవి నుంచి వర్షాకాలం మారేటప్పటికి వైరస్ ప్రభావం తిరిగి విజృంభించే అవకాశముందన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రులను కోరారు.
ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రాధాన్యం..
వైరస్‌పై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మోదీ. రెండు దశల లాక్‌డౌన్‌లో రెండో విడతలో కొన్ని మినహాయింపులు తీసుకువచ్చినట్లు మోదీ గుర్తుచేశారు. ఉపాధి హామీ సహా మరికొన్ని పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.
తొమ్మిదిమందికే అవకాశం..
లాక్‌డౌన్ గడువు మే 3తో ముగుస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరారు. మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, పుదుచ్ఛేరి, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బిహార్, గుజరాత్, హర్యానా సీఎంలకు మోదీ మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.