తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగ: 3లక్షల మందితో గహ్లోత్​ భారీ ర్యాలీ - rajasthan rally against citizenship amendment act

భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ జైపూర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వివిధ పార్టీల నేతలు సహా దాదాపు 3లక్షల మంది హాజరైనట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్​ను హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Nearly 3 lakh carry out peaceful march against CAA, NRC in Jaipur
'పౌర' సెగ: 3లక్షల మందితో గహ్లోత్​ భారీ ర్యాలీ

By

Published : Dec 22, 2019, 7:51 PM IST

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ భారీ ర్యాలీ నిర్వహించారు. జైపూర్​లో 'సంవిధాన్ బచావో' పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో సీపీఐ, సీపీఎం, ఆమ్​ ఆద్మీ, సమాజ్​వాదీ, ఆర్​ఎల్​డీ, జేడీఎస్​ పార్టీలు ఒక్కటై భాజపా విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. నగరంలోని అల్బర్ట్ హాల్​ నుంచి గాంధీ సర్కిల్​ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు 3 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

'హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారు'

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, భాజపా, ఆరెస్సెస్​లపై గహ్లోత్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మతప్రాతిపదికన ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పౌరసత్వ చట్ట సవరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారత్​ను హిందూ దేశంగా మార్చే అజెండాలో భాగంగానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు.

"వారు(భాజపా) అహంకారంతో పాలన చేస్తున్నారు. వారికున్న మెజారిటీతో చట్టాలు తీసుకురాగలరు. కానీ ప్రజల హృదయాలను గెలుచుకోలేరు. ఉత్తర్​ప్రదేశ్​లో వివిధ ఘటనల్లో 15 మంది మరణించారు. భాజపా పాలిస్తున్న ప్రతీచోట హింస జరుగుతోంది. 70ఏళ్లుగా దేశం రాజ్యాంగ సూత్రాలను పాటిస్తూ వస్తోంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తోంది. భారత్​ను హిందూ దేశంగా మార్చేందుకు ఆరెస్సెస్, భాజపాలు ప్రయత్నిస్తున్నాయి. అసోంలో ఎన్​ఆర్​సీ సర్వేలో గుర్తించిన 19 లక్షలమందిలో 16లక్షలమంది హిందువులే ఉన్నారు. ఎన్​ఆర్​సీ విజయవంతం కానప్పటికీ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చారు."-అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్ ముఖ్యమంత్రి.

రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలోని అసలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. యువత మొత్తం ఇప్పుడు రోడ్లపైకి వచ్చారని అన్నారు. ప్రభుత్వానికి రైతులు, యువతే ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'పిల్లలు ఆడుకునే బొమ్మలు 67% ప్రమాదకరమైనవే'

ABOUT THE AUTHOR

...view details