దేశవ్యాప్తంగా 23 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నాలుగో విడత లాక్‌డౌన్ సమయంలో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు దేశంలోపలే ప్రయాణించిన వారిని సైతం క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపింది. మే 26 నాటికి మొత్తంగా 22లక్షల 81 వేలమందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు వివరించింది.
మే 14 నాటికి 11 లక్షల 95 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉండగా..12 రోజుల్లోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు పేర్కొంది. మే 26 నాటికి మహారాష్ట్రలో 6లక్షల 2 వేల మంది, గుజరాత్‌లో 4లక్షల 42 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఉత్తర్ప్రదేశ్లో 3లక్షల 6 వేల మంది, బిహార్‌లో 2.1 లక్షల మంది, ఛత్తీస్‌గఢ్‌లో 1.86 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 14 వేల 930 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొంది.