దేశంలో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంపై కేంద్రం నివేదిక విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 1,874 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హోంశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 382 మంది, పశ్చిమ బంగలో 227 మంది మరణించారని తెలిపింది.
'వరుణుడి ప్రకోపానికి దేశంలో 1,874 మంది బలి'
ఈ ఏడాది దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలు, వరదలకు 1,874 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 382 మంది మరణించినట్లు తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం వరదలు, భారీ వర్షాల వల్ల దేశంలో మొత్తం 738 మంది గాయపడ్డారు. 20 వేలకు పైగా జంతువులు బలయ్యాయి. 1.09 లక్షల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2.05 లక్షల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సీజన్లో 14.14 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు హోంశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సెప్టెంబర్ 30 నాటికే వర్షాకాలం ముగిసినా దేశంలోని పలు ప్రాంతాలు మాత్రం ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. 1994 తర్వాత ఈ ఏడాదే దేశంలో అత్యధిక వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.