రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ క్రమంగా బలం పుంజుకుంటోంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఎగువసభలో విపక్షాలకు, ఎన్డీఏకి సంఖ్యా బలంలో ఉన్న తేడా మరింత తగ్గింది. ఫలితాల అనంతరం రాజ్యసభలో అధికార భాజపాకు సొంతంగా 86మంది సభ్యులుండగా.. విపక్ష కాంగ్రెస్ పార్టీకి 41మంది సభ్యులు మద్దతుంది.
భాజపావైపే మొగ్గు...
రాజ్యసభలో ఖాళీ అయిన 61 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రకటించగా.. వీటిలో 42 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 19 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. భాజపా 8, కాంగ్రెస్ 4, వైకాపా నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. మరో మూడు స్థానాలలో.. చిన్న పార్టీలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో తమకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో గెలవగలిగిన స్థానాలకంటే.. మరో రెండు స్థానాల్లో అదనంగా భాజపా విజయం సాధించింది. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలోని కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ ఫిరాయించటం వల్ల కమలదళం ఎనిమిది చోట్ల విజయకేతనం ఎగరేసింది.
మొత్తంగా ఖాళీ అయిన 61 రాజ్యసభ స్థానాలలో.. భాజపా 17, కాంగ్రెస్ 9 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా మిత్రపక్షమైన జేడీయూ మూడు స్థానాలు సొంతం చేసుకుంది. బీజేడీ, టీఎంసీ నాలుగు చొప్పున రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అన్నాడీఎంకే 3, డీఎంకే 3, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఆర్ఎస్ రెండు చొప్పున సొంతం చేసుకున్నాయి.
ఈ ఫలితాల అనంతరం రాజ్యసభలో భాజపా బలం 86కు పెరగ్గా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలం 41కి పరిమితమైంది. మొత్తంగా 245 మంది సభ్యులున్న ఎగువసభలో.. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి వందమందికి పైగా సభ్యుల మద్దతుంది. భాజపా స్నేహపూర్వక పక్షాలైన అన్నాడీఎంకేకు 9, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులుండగా.. మిగిలిన చిన్నాచితకా పార్టీల మద్దతుతో కీలకమైన బిల్లులను సులభంగా ఆమోదింపజేసుకునేందుకు వీలు కలగనుంది.