మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఎంపికపై ఎన్డీఏ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మాజీ కేంద్ర మంత్రులు మేనకా గాంధీ, రాధామోహన్ సింగ్, వీరేంద్రకుమార్లలో ఒకరిని సభాపతిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఎనిమిదో సారి ఎంపీగా ఎన్నికయిన మేనకా గాంధీ స్పీకర్ పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యులు వ్యవహరించాలనే సంప్రదాయాన్ని అనుసరించి మేనకా గాంధీ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
భాజపాతో ఉన్న దృఢమైన సంబంధాలు, ఆరుసార్లు లోక్సభకు ఎంపికైన అనుభవం వల్ల మాజీ మంత్రి రాధామోహన్ సింగ్ పేరునూ పార్టీ పరిశీలించే అవకాశాలున్నాయి.
పోటీలో మరికొందరు
గత ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రిగా పనిచేసిన ఎస్.ఎస్.అహ్లువాలియా పేరూ స్పీకర్ రేసులో వినిపిస్తోంది. ఆరోసారి ఎంపీ, ఎస్సీ వర్గానికి చెందిన నేత వీరేంద్రకుమార్ సైతం రేసులో ఉన్నారు.