తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇరిగేషన్​ కుంభకోణంలో.. అజిత్‌ పవార్‌కు క్లీన్‌చిట్‌ - అజిత్‌ పవార్‌కు క్లీన్‌చిట్‌

ఇరిగేషన్​ కుంభకోణం కేసులో ఎన్​సీపీ నేత అజిత్ పవార్​కు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ క్లీన్​చిట్​ ఇచ్చింది. 1999-2009లో అజిత్​ జలవనరులశాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. విదర్భ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులు, టెండర్ల అనుమతులకు సంబంధించి రూ.7 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలతో అనిశా కేసు నమోదు చేసింది. ఆ కేసులో క్లీన్​చిట్​తో అజిత్​కు ఇప్పుడు ఊరట లభించింది.

ncp leader ajith pawar gets clean chit in vidarbha irrigation scam
ఇరిగేషన్​ కుంభకోణంలో.. అజిత్‌ పవార్‌కు క్లీన్‌చిట్‌

By

Published : Dec 7, 2019, 9:53 AM IST

ఇరిగేషన్‌ కుంభకోణం కేసులో ఎన్​సీపీ నేత అజిత్‌ పవార్‌కు ఊరట లభించింది. ఈ మేరకు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (అనిశా) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అనిశా సమర్పించిన నివేదిక ఆధారంగా విదర్భ ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్ల అనుమతికి సంబంధించి జరిగిన అవినీతిలో అజిత్‌ పవార్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణలను బాంబే హైకోర్టు నాగ్‌పుర్‌ బెంచ్‌ కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్‌ను మహా వికాస్‌ అఘాడీ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌) ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు ముందు నవంబరు 27న అనిశా కోర్టుకు సమర్పించింది.

ఇదీ కేసు

2012లో బాంబే హైకోర్టులోని నాగ్‌పుర్‌ బెంచ్‌ ముందు రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటి ఆధారంగా విదర్భ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ (వీఐడీసీ)లో 45 ప్రాజెక్టుల్లో 2,654 టెండర్లకు సంబంధించి అనిశా దర్యాప్తు చేస్తుంది. నవంబరు 25న అవినీతి వ్యతిరేక సంస్థ అవినీతి ఆరోపణలున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి తొమ్మిది కేసుల్లో విచారణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాటితో అజిత్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ‘‘దర్యాప్తులో ఎవరికి వ్యతిరేకంగా నేరం చేసినట్లు ఆధారాలు లభించనందున విచారణ ఆపేస్తున్నాం. అయితే ఈ తొమ్మిది కేసులతో అజిత్‌ పవార్‌, ఒకప్పటి వీఐడీసీ ఛైర్మన్‌కు ఎలాంటి సంబంధం లేదు’’ అని అనిశా పేర్కొంది.

తాజాగా ప్రభుత్వ అభిప్రాయం మేరకు అజిత్‌ పవార్‌కు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించినట్లు అనిశా పేర్కొంది. మేము దర్యాప్తు చేస్తున్న ఏ కేసుల్లో అజిత్‌ పవార్‌ నిందితుడిగా లేరు. విదర్భ నీటిపారుదలకు టెండర్లకు సంబంధించి అన్ని కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుందని అనిశా పేర్కొనడం గమనార్హం.

అజిత్‌ పవార్‌ 1999-2009 మధ్య కాలంలో కాంగ్రెస్‌-ఎన్​సీపీ కూటమి ప్రభుత్వంలో జలవనరులశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన విదర్భ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో విదర్భ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులు, టెండర్ల అనుమతులకు సంబంధించి రూ.7 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలతో అజిత్‌ పవార్‌పై అనిశా కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి:తెలంగాణ పోలీసులకు ఒడిశాలో 'సైకత' సలాం!

ABOUT THE AUTHOR

...view details