తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా సమరం: చరిత్ర ఘనం.. ప్రస్తుతం ఘోరం! - రానున్న ఎన్నికల్లో ఎన్​సీపీ, కాంగ్రెస్​ ప్రభావం

మహారాష్ట్రలో ఒకప్పుడు అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) క్రమంగా బలహీనపడుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థంగా నిర్వహించలేకపోతున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశాలు వచ్చినా రెండు పార్టీలు చేజార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార భాజపాను అవి ఎంతమేర నిలువరించగలవో చూడాలి.

మహా సమరం: చరిత్ర ఘనం.. ప్రస్తుతం ఘోరం!

By

Published : Oct 7, 2019, 10:49 AM IST

కాంగ్రెస్​, నేషనలిస్ట్​ కాంగ్రెస్​.. మహారాష్ట్రలో దశాబ్దాల తరబడి పాలన సాగించిన పార్టీలు. కాలం గడిచే కొద్ది.. అధికారం దూరమై... ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేక సతమతమవుతున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో బరిలో ఉన్నాయి. ఏ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సౌలభ్యాలున్నా.. బలమైన ప్రతిపక్షంగా నిలవడం గట్టి సవాలే.

ప్రజల పక్షాన నిలబడటం.. ప్రభుత్వం ఏ చిన్నతప్పు చేసినా ఇరుకున పెట్టడం.. ఉద్యమాలతో నిత్యం ప్రజల్లో ఉండటం వంటి చర్యలతోనే ప్రతిపక్షాలు ప్రజాదరణను పొందగలుగుతాయి. ఇలాంటి పాత్రలో రెండు పార్టీలూ సఫలీకృతం కాలేకపోయాయి. మరోవైపు కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు వారాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవి భాజపాను ఎంతమేర ఢీకొని నిలదొక్కుకుంటాయో చూడాలి.

అవకాశాలు వచ్చినా...

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని భాజపా పాలనలో అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాలు వచ్చినా ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు వాటిని అందిపుచ్చుకోలేక పోయాయి. ముంబయిలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం చెట్ల కొట్టివేత వ్యవహారంపై స్థానికుల్లో వ్యతిరేకత ఉంది. దీనిపై సహజంగానే ఫడణవీస్‌పై కొంత ఆగ్రహం ఉంది. చాలా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. అవన్నీ చిన్న స్వచ్ఛంద సంస్థలు చేపట్టినవే.

పంటల బీమా కుంభకోణంపై ఏడాది కాలంగా రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. కొన్ని ప్రైవేటు కంపెనీలు తూతూమంత్రంగా రైతులకు బీమా చెల్లించి, రూ. వందల కోట్లు జేబుల్లో వేసుకున్న ఈ వ్యవహారంపై సీపీఐ వంటి కొన్ని పార్టీలు, కొద్దిమంది సామాజిక కార్యకర్తలు తప్ప ప్రధాన ప్రతిపక్షాలు ఆందోళనకు దిగలేదు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పలు అంశాల్లో తీవ్రంగా విమర్శలు చేసింది శివసేన మాత్రమే. ఇలా కాంగ్రెస్‌, ఎన్‌సీపీ కొంతమేర ప్రతిపక్ష పాత్రను శివసేనకే అప్పగించాయన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

‘చే’జారుతున్న ఓట్లు..

మహారాష్ట్రలో 1995 వరకూ కాంగ్రెస్‌ పార్టీదే పైచేయి. అదే ఏడాది శివసేన నేతృత్వంలో తొలిసారిగా పూర్తిస్థాయి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత 2014 వరకు ఎన్‌సీపీతో కలిసి 3 సార్లు కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటికీ ఆ పార్టీలకు ఓట్ల శాతం క్రమేపీ తగ్గిపోతూ వచ్చింది. చివరిసారి 2009లో అధికారంలోకి వచ్చినప్పటికి రెండు పార్టీలకు 37 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటికి భాజపా-శివసేన ఓట్ల శాతం 35. గత 20 ఏళ్లలో కాంగ్రెస్‌, ఎన్‌సీపీ దాదాపు 19 శాతం ఓట్లను కోల్పోయాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే గత ఐదేళ్లలోనే 5 శాతం ఓట్లు కోల్పోయాయి.

నాయకత్వ లోపం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లోపంతో సతమతమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన ‘మాస్‌ లీడర్‌’గా ఎదగలేకపోయారు. తాజా అసెంబ్లీ ఎన్నికలో ఏ ఒక్క నేత అయినా తప్పక గెలుస్తారని చెప్పలేని పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కొంత మేరకు మెరుగు...

* శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ పరిస్థితి కాంగ్రెస్‌ కంటే కొంత మెరుగ్గా ఉంది. ఓటర్లలోనూ, కార్యకర్తల్లోనూ స్థైర్యాన్ని నింపగల ద్వితీయ శ్రేణి నాయకులు ఆ పార్టీలో చాలామంది ఉన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా మెరుగ్గా ఉంది. దీని పరిధిలో అనేక సహకార సంఘాలు కూడా ఉన్నాయి. అజిత్‌ పవార్‌, జయంత్‌ పాటిల్‌ వంటివారు గెలుస్తారని అంచనాకు రావచ్చు. శరద్‌పవార్‌కు ఉన్న జనాకర్షణ కూడా కొంత పనిచేస్తుంది.

కానీ ముంబయి, ఠాణె, పుణె, నాగ్‌పుర్‌ వంటి నగరాల్లో ఆ పార్టీకి పెద్దగా పట్టు లేదు. మరాఠాల పార్టీగా ఉన్న ముద్ర కారణంగా ఇతర వర్గాల్లోనూ అంత ఆదరణ లేదనే చెప్పాలి. రెండు పార్టీలు కలిస్తే ఒకరికొకరు సాయపడినా ఇందులోనూ చాలామేర పరిమితులున్నాయి. మంచి ప్రతిపక్షంగా వ్యవహరించడానికి.. ఏదీ నేర్చుకోవడానికి.. ఆ పార్టీలు ఎలాంటి ఆసక్తి చూపడం లేదన్న వాదన ఉంది. దీంతోనే గత ఐదేళ్లలో ప్రభుత్వానికి సవాల్‌ విసిరేలా ఏమీ చేయలేకపోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చేజార్చుకున్న అవకాశాలు..
మహారాష్ట్రలో ప్రతిపక్షంగా కాంగ్రెస్‌, ఎన్‌సీపీలకు కొన్ని అవకాశాలొచ్చినప్పటికీ రెండు పార్టీలూ వాటిని చేజార్చుకున్నాయి. బడి పిల్లల ఆహారం కొనుగోలులో అక్రమాలు (చిక్కీ కుంభకోణం) చోటు చేసుకున్నప్పుడు గానీ.. ఫడణవీస్‌ సొంత నగరం (నాగ్‌పుర్‌)లో అనేక నేర ఘటనలు చోటుచేసుకున్నప్పుడు గానీ ఆ పార్టీలు భాజపాను ఇరుకున పెట్టలేకపోయాయి.

89,000 మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. 24,000 మంది మాత్రమే ప్రయోజనం పొందారు. స్వయానా ముఖ్యమంత్రి రూపకల్పన చేసిన జల సంరక్షణ పథకం విఫలమైంది. కానీ వీటిని ప్రతిపక్షాలు ఎత్తి చూపలేకపోయాయి. మద్దతు ధరల కోసం రైతుల ఉద్యమం, మరాఠాలకు రిజర్వేషన్‌ కోసం ఆందోళన, నానర్‌ చమురుశుద్ధి కర్మాగారానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ పార్టీలకు సంబంధం లేని సంస్థలే చేపట్టాయి. వీటికి మీడియా మద్దతు ఇవ్వడం వల్ల ప్రభుత్వం కొన్ని డిమాండ్లను ఆమోదించాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details