అరుణాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన భారత వాయుసేన విమానం 'ఏఎన్-32'ను వెతికేందుకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగిస్తోంది సైన్యం. తాజాగా నౌకాదళం, ఇస్రో శాటిలైట్లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 'సుఖోయ్-30, సీ-130జే సూపర్ హెర్క్యులస్' యుద్ధవిమానాలు అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల పరిధిలో విస్త్తృతంగా వెతికేందుకు శాటిలైట్లను మోహరించింది ఇస్రో. అనుమానిత ప్రాంతాలను గాలించేందుకు నావికా దళానికి చెందిన 'పీ-8ఐ స్పై' విమానాలు తమిళనాడు ఆరక్కోణం నుంచి బయలుదేరాయి.
ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంపై విమానంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. పరిస్థితిని రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఎలా జరిగింది?
అసోంలోని జోహ్రాత్ ఎయిర్‌బేస్ నుంచి సోమవారం మధ్యాహ్నం 12:25 గంటలకు బయలు దేరింది విమానం. ఒంటి గంట సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెన్చూకా గగనతలం వద్ద సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ఏడుగురు అధికారులు, ఆరుగురు వైమానిక దళ సభ్యులు ఉన్నారు.