నవరాత్రి స్పెషల్... టాటూల్లోనూ దేశభక్తి చూపిస్తున్న యువత విజయదశమి సందర్భంగా ఊరూరా.. వాడవాడలా నవరాత్రుల సందడి మొదలవుతోంది. పలుచోట్ల అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన యువత దైవారాధనలో దేశభక్తిని మమేకం చేస్తున్నారు. జాతీయతా భావం ఉట్టిపడేలా శరీరంపై తాత్కాలిక పచ్చబొట్లు వేయించుకొని దేశభక్తిని చాటుతున్నారు. భాగ్యశ్రీ మస్రానీ అనే గుజరాతీ మహిళ కొన్నేళ్లుగా నవరాత్రులను తన బృందంతో కలిసి వినూత్నంగా జరుపుకుంటున్నారు. ఈసారి.. మరింత కొత్తగా దేశభక్తి ఉట్టిపడేలా తాత్కాలిక పచ్చబొట్లను వేయించుకుంటున్నారు. భావ్‌నగర్‌కే చెందిన టాటూ ఆర్టిస్ట్ జయ్ బార్డ్... నవరాత్రుల సమయంలో ఒక్క పైసా తీసుకోకుండా ఈ పచ్చబొట్లను వేయడం విశేషం.
''నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్యాల్లో సందడి చేస్తాం. ఇదే సమయంలో దేశభక్తిని చాటడం సహా ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ పచ్చబొట్లు. ఈ టాటూల ద్వారా వివిధ రూపాల్లో సందేశాలు ఇవ్వాలనుకుంటున్నాం. తద్వారా ప్రజల్లో చైతన్యం రావడం సహా దేశ అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుంది.''
- భాగ్యశ్రీ మస్రానీ, గుజరాతీ మహిళ
''నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా తాత్కాలిక పచ్చబొట్లు వేస్తున్నాం. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను ప్రతిబింబించేలా 370వ అధికరణ రద్దు, ఇస్రో, చంద్రయాన్-2 సహా హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడానికి పలు రకాల టాటూ డిజైన్లను ఈ నవరాత్రి సందర్భంగా ఉచితంగానే వేస్తున్నాం.''
-జయ్ బార్డ్, టాటూ ఆర్టిస్ట్
దేశభక్తిని ప్రతిబింబించేలా జాతీయ పతాకం, సైనిక గౌరవ చిహ్నాలు, ఆర్టికల్ 370 రద్దు, చంద్రయాన్-2 వంటి పచ్చబొట్లను శరీరాలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. భారత్-అమెరికాల మధ్య స్నేహబంధానికి చిహ్నంగా మోదీ-ట్రంప్‌ల చిత్రాలనూ పచ్చబొట్లుగా పొడిపించుకుంటున్నారు. యువతలో తాత్కాలిక పచ్చబొట్ల పట్ల డిమాండ్ ఉన్నందున, టాటూ స్టూడియోలు మరిన్ని రకాల పచ్చబొట్లను తీసుకొస్తున్నాయి.
''నవరాత్రుల నేపథ్యంలో పచ్చబొట్లను వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. యువతలో టాటూల పట్ల క్రేజ్ ఏర్పడింది. ఒక్కో పచ్చబొట్టు రూ. 5 వేల నుంచి రూ. పది వేల వరకు వివిధ రకాల్లో ఉంటాయి. పచ్చబొట్లలో ఉన్న రకాలు, పరిమాణాలను బట్టి ఒక్కోసారి రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేస్తాం. ఈ తాత్కాలిక పచ్చబొట్లు ఒకరోజు నుంచి వారం రోజుల వరకు ఉంటాయి.''
- రాబీ, టాటూ స్టూడియో యజమాని
గుజరాత్‌లో ట్రెండ్ అవుతున్న దేశభక్తి టాటూలు సామాజిక మాధ్యమాలను కూడా ఆకర్షిస్తున్నాయి. పచ్చబొట్ల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండుగల్లో దేశభక్తిని ఇనుమడింపజేస్తున్న ఈ టాటూలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చూడండి:'విపక్ష నేతల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు సర్కార్ కుట్ర'