అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. అడుగడుగునా విశిష్టతలతో.. రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం అంగరంగ వైభవంగా భూమిపూజ చేయడానికి ట్రస్ట్ సన్నద్ధమైంది. అయితే ఆ రోజున రాముడితో పాటు ముగ్గురు సోదరులైన భరతుడు, లక్ష్మణుడు, శత్రుజ్ఞుడు ప్రత్యేక వస్త్రాలంకరణలో దర్శనమివ్వనున్నారు.
గత రెండు తరాలుగా రామ్‌లల్లాకు వస్త్రాలు తయారు చేస్తున్న భగవత్ ప్రసాద్ కుటుంబమే.. ఈసారి దుస్తులు తయారు చేస్తోంది. ఈ కార్యక్రమంలో రామ్‌లల్లా నవరత్నాలు పొదిగిన వెల్వెట్, పచ్చని వస్త్రాల్లో కనువిందు చేయనున్నారు.
17 మీటర్ల వస్త్రం...
రామ్‌లల్లా సహా మిగతా దేవుళ్ల వస్త్రాలంకరణకు 17 మీటర్ల వస్త్రం వినియోగించనున్నారు. వీటితోనే దుప్పట్లు, కర్టెన్లు తయారు చేయనున్నారు. దేవతామూర్తులకు ప్రత్యేకమైన దండలు, ఆభరణాలు కూడా సిద్ధం చేస్తున్నారు. హనుమంతుడినీ ప్రత్యేకంగా అలంకరించనున్నారు.
మూడు పదులుగా..
30 ఏళ్ల క్రితం.. శ్రీ రామజన్మభూమి పూజారి లాల్దాస్ వస్త్రాలంకరణ బాధ్యతలను భగవత్ ప్రసాద్ తండ్రి బాబు లాల్‌కు అప్పగించారు. అప్పట్నుంచి ఈ కుటుంబమే వస్త్రాలంకరణ పనులు చూసుకుంటోంది. వీళ్లిద్దరూ కుట్టిన వస్త్రాలే నేపాల్‌లోని జనకపుర్లో ఉన్న జానకి దేవాలయానికి పంపారు. అక్కడే రాముడి బంధువైన విక్రముడిని ప్రతిష్ఠించారు. ఆ ఆలయంలోనూ శంకర్‌లాల్, భగవత్ ప్రసాద్ తయారు చేసిన దుస్తులతోనే దేవుళ్లను అలంకరించారు.
వస్త్రాలను సిద్ధం చేస్తున్న భగవత్ కుటుంబం మోదీ చేతుల మీదుగా...
బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో శంకుస్థాపన జరిగేలా భూమిపూజకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకుగాను నక్షత్రాల్లాంటి 5 వెండి ఇటుకలను వాడతారు. ప్రధాని మోదీ రామ జన్మభూమి ప్రాంతానికి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. ఆయన వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ప్రాచీన హనుమాన్ దేవాలయంలో ప్రధాని పూజలు చేసిన తర్వాత భూమిపూజలో పాల్గొంటారు.