తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాల రద్దుపై కేంద్రానికి రైతుల డెడ్​లైన్ - రైతుల నిరసనలు

అక్టోబర్ రెండో తేదీలోగా సాగుచట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు కేంద్రానికి డెడ్‌లైన్ విధించాయి. డిమాండ్లు నెరవేరే వరకూ దేశ రాజధానిని వదిలివెళ్లేది లేదని తేల్చిచెప్పాయి. చక్కా జామ్ పేరిట రైతుసంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త రాస్తారోకో ప్రశాంతంగా జరిగినట్లు ప్రకటించాయి.

Nationwide chakkajam end with peaceful called by protesting farmer unions
చక్కా జామ్​లో కేంద్రానికి రైతుల డెడ్​లైన్

By

Published : Feb 6, 2021, 5:20 PM IST

Updated : Feb 6, 2021, 6:54 PM IST

కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన 'చక్కా జామ్‌'.. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బెంగళూరు, పుణె, దిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పంజాబ్​లో రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులు

కేంద్రానికి డెడ్​లైన్​..

గాంధీ జయంతిలోగా సాగుచట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు కేంద్రానికి డెడ్‌లైన్ విధించాయి. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఇళ్లకు వెళ్లేదిలేదని తేల్చిచెప్పాయి. సాగుచట్టాల రద్దుపై కేంద్రం దిగొచ్చేవరకూ ఆందోళనలు కొనసాగుతాయన్న భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్‌.. ఒత్తిళ్ల మధ్య ప్రభుత్వంతో చర్చలు జరపలేమని స్పష్టంచేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వేదికల వద్ద అంతర్జాలసేవలను నిలిపివేయడం సహా అధికారుల వేధింపులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన చక్కాజామ్ కార్యక్రమం విజయవంతమైనట్లు ప్రకటించారు.

జమ్ముకశ్మీర్​లో చక్కా జామ్​లో పాల్గొన్న రైతులు

"అక్టోబర్​ 2 తేదీలోపు సాగు చట్టాలను రద్దు చేయాలి. అంతవరకు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తాం. సాగుచట్టాల రద్దుపై కేంద్రం దిగొచ్చేవరకూ ఆందోళనలు కొనసాగుతాయి. చక్కా జామ్​లో అలజడలు సృష్టించడానికి కొందరు ప్రయత్నించారు. అందుకే చక్కా జామ్​ను ముగించినట్లు ప్రకటించాం."

-రాకేశ్ టికాయత్​, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి

ప్రశాంతంగా..

దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మినహా మిగతా రాష్ట్రాలలో రహదారుల దిగ్బంధనం కొనసాగగా.. అన్నదాతలకు సంఘీభావంగా రోడ్లెక్కిన రైతులు సాగుచట్టాలకు వ్యతిరేకంగా నినదించారు. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర , కేరళ, జమ్ముకశ్మీర్‌ల్లో అన్నదాతలకు మద్దతుగా.. రైతుసంఘాలనేతలు, రైతులు రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు. రాజస్థాన్-హరియాణా సరిహద్దు ప్రాంతమైన షాజహాన్‌పూర్ వద్ద అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

హరియాణాలో రాస్తోరోకో నిర్వహించిన అన్నదాతలు

పంజాబ్‌లోని అమృతసర్, మొహాలీలో రహదారులను దిగ్బంధించారు. దిల్లీ అమృతసర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని జమ్ము-పఠాన్​ కోట్​ జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాతలు.. సాగుచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. దిల్లీలోని షాహిదీ పార్క్ వద్ద చక్కాజామ్‌కు మద్దతుగా చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. దాదాపు యాభైమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

రైతులకు మద్ధతుగా చక్కా జామ్​లో పాల్గొన్న మహిళలు

భద్రత కట్టుదిట్టం

రహదారుల దిగ్బంధం నేపథ్యంలో రాష్ట్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా దిల్లీలో.. గణతంత్ర దినోత్సవం నాటి హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల మందికిపైగా పోలీసులు, పారామిలిటరీ, రిజర్వు బలగాలు మోహరించారు. దిల్లీ గాజీపూర్ సరిహద్దుల్లో భారీగా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.

"చక్కాజామ్​ దేశవ్యాప్తంగా జరిగినప్పటికీ.. జనవరి 26న జరిగిన హింసాకాండను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాం. దిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొందరిని ముందుగానే అదుపులోకి తీసుకున్నాం. నగరంలో ట్రాఫిక్​ ఇబ్బందులు లేకుండా అంతటా ప్రశాంతంగానే రాస్తారోకో జరిగింది."

-చిన్మోయ్​బిశ్వాల్​, దిల్లీ పోలీసు అధికారి

ఎర్రకోట సహా జనవరి 26న ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన ఐటీఓ ప్రాంతం వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చక్కాజామ్ జరుగుతున్నంత సేపు మెట్రో స్టేషన్లను తాత్కాళికంగా మూసివేశారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. చక్కాజామ్ కార్యక్రమంలో అంబులెన్సులు, పాఠశాల బస్సులు సహా అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు.

ఇదీ చూడండి:'ఈగో వల్లే దీదీ 'పీఎం కిసాన్'​ను ఆపేశారు'

Last Updated : Feb 6, 2021, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details