తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మందిరం.. జాతీయవాదం.. సంక్షేమం'

ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా భాజపా ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. రామమందిర నిర్మాణ హామీ.. సంక్షేమ పథకాల వాగ్దానాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. జాతీయవాదం, పేదరికంపై యుద్ధం, సుపరిపాలన, వ్యవసాయ రంగానికి ఊతం, చిన్న సన్నకారు రైతులకు పింఛను తదితర అంశాల మేళవింపుతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

'మందిరం.. జాతీయవాదం.. సంక్షేమం'

By

Published : Apr 8, 2019, 6:55 PM IST

విజయమే లక్ష్యంగా భాజపా మేనిఫెస్టో విడుదల

నవభారత నిర్మాణమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుకు తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో మేనిఫెస్టో విడుదల చేశారు. 'సంకల్ప్​ పత్ర్' పేరుతో 130 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అక్షర రూపం కల్పించామని భాజపా ప్రకటించింది. ప్రధాని మోదీ లేఖతో పాటు మొత్తం 45 పేజీల ప్రణాళికలో జాతీయవాదం, రక్షణ, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యేసరికి పేదరికం లేని సంపన్న భారత్​ను నిర్మిస్తామని భాజపా విశ్వాసం వ్యక్తం చేసింది. ఇందుకోసం 75 ప్రతిజ్ఞలు చేసింది.

రాజ్యాంగానికి లోబడి అయోధ్యలో రామమందిర నిర్మాణం, 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​, రైతుల ఆదాయం రెట్టింపు, జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు వంటివి మేనిఫెస్టోలో ప్రధానాంశాలు. మరిన్ని ముఖ్య హామీలు.

⦁ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల శాతాన్ని ఐదేళ్లలో సింగిల్​ డిజిట్​కు పరిమితం చేసేలా కృషి.

⦁ 2022 కల్లా ఇళ్లు లేని వారందరికీ పక్కా గృహాల నిర్మాణం.

⦁ 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్​ధన్'​ పథకాన్ని మరింత విస్తరింపజేసి చిన్న వ్యాపారులకు పింఛను కల్పన.

⦁ దేశ ఆర్థిక వ్యవస్థ విలువను 2025 నాటికి 5 ట్రిలియన్​ డాలర్లు, 2032 నాటికి 10 ట్రిలియన్​ డాలర్లకు పెంచడమే లక్ష్యం.

⦁ 2047: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేసరికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతామని హామీ.

⦁ జాతీయ పౌర రిజిష్టర్​ను దశల వారీగా దేశమంతటా అమలు చేస్తామని వాగ్దానం.

ఆర్టికల్​ 370, 35 ఏ రద్దు..

భాజపా మరోసారి అధికారంలోకి రాగానే జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.

కశ్మీర్లో బయటి వ్యక్తులు ఆస్తులు కలిగి ఉండడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ చెబుతోంది. దీని వల్ల స్థానికేతరులు, మహిళలపై వివక్ష పెరుగుతోందని అభిప్రాయపడింది భాజపా.

జీఎస్టీ సరళీకరణ...

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సరళీకరణ ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపింది. భాగస్వామ్యపక్షాలతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది.

రక్షణరంగ బలోపేతం, తీవ్రవాదంపై ఉక్కుపాదం..

రక్షణ రంగ పరికరాలు, ఆయుధ సంపత్తిని సేకరించే ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పేర్కొంది భాజపా. ఉగ్రవాద అణిచివేతలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని స్పష్టం చేసింది.

వ్యవసాయం, రైతులకు పింఛను..

పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం 5 ఎకరాలలోపు రైతులకే ఏటా 6 వేల రూపాయల చొప్పున సాయం అందిస్తోంది కేంద్రం. ఇకపై రైతులందరికీ ఈ సాయం ఇస్తామని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి 25 లక్షల కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన చిన్న సన్నకారు రైతులకు పింఛను ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది భాజపా.

జలజీవన్​ మిషన్​..

'కృషి సించాయ్‌ యోజన' కింద త్వరలోనే 68 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది భాజపా. ప్రజల దాహార్తిని తీర్చేందుకు 'జల్‌జీవన్ మిషన్‌' పేరిట కొత్త పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో ప్రతిపాదించింది. 'నల్‌ సే జల్‌' కింద 2024 నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇలాంటి ప్రజాకర్షక, సంక్షేమ పథకాలతో భాజపా మేనిఫెస్టో రూపొందించింది. తమ మేనిఫెస్టో జాతీయవాదాన్ని మేలుకొల్పుతుందని వ్యాఖ్యానించింది. 2019 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది కమలదళం.

ABOUT THE AUTHOR

...view details