దేశంలో 'జాతీయవాదం', 'భారత్ మాతాకీ జై' నినాదాలు దుర్వినియోగమవుతున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని 'భావోద్వేగ భారత్'గా నిర్మించేందుకు వాటిని వినియోగిస్తున్నారని పరోక్షంగా భాజపాపై విమర్శలు చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ రచనలు, ప్రసంగాలపై పురుషోత్తం అగర్వాల్, రాధా కృష్ణ రాసిన 'హూ ఈజ్ భారత్ మాతా' పుస్తకాన్ని ఇటీవలే ఆవిష్కరించారు మన్మోహన్. ఉజ్వల ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచ అగ్రశక్తుల్లో ఒకటిగా నేడు భారత్ గుర్తింపు పొందుతోందంటే దానికి ప్రధాన కారణం నెహ్రూయేనన్నారు. తొలినాళ్లలో దేశం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన పాలన సాగించారని గుర్తు చేసుకున్నారు. భారత ఘన వారసత్వాన్ని ఆయన పూర్తిగా ఒంటబట్టించుకున్నారని మన్మోహన్ చెప్పారు. ఆధునిక భారత అవసరాలతో వాటిని సమన్వయం చేసుకున్నారని వివరించారు.