దేశదేశాల్లో కరోనా వైరస్ విజృంభణతో కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఎక్కడికక్కడ జీవవ్యర్థాల రాశీ ఇంతలంతలవుతోంది. భారీగా పోగుపడుతున్న బయో వ్యర్థాలను సత్వరం సక్రమంగా నిర్మూలించకపోతే మరిన్ని అనర్థాలు వాటిల్లే ముప్పుంది. దేశీయంగా ఆస్పత్రులనుంచి జీవ వైద్య వ్యర్థాలను 48 గంటల్లోపు తరలించని పక్షంలో- గాలిలోకి వైరస్, బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) హెచ్చరిస్తోంది. కొవిడ్-19గా వ్యవహరిస్తున్న మహమ్మారి బారినపడ్డ బాధితులకు, అనుమానితులకు వినియోగించిన సూదులు, సిరంజీలు సహా దేన్నీ ఇతర సాధారణ వ్యర్థాలతో కలపవద్దని, అన్నింటినీ కలగలిపి తగలబెట్టరాదంటూ అది వివిధ మార్గదర్శకాలూ జారీ చేసింది.
జాతీయ కార్యచరణ వ్యూహం అవసరం
కరోనా అనుమానితులు క్వారంటైన్‌లో ఉన్న నివాసాలనుంచి చెత్త సేకరించడంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో పురపాలక కమిషనర్లకు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శినుంచి వివరణాత్మక ఆదేశాలు జారీ అయ్యాయి. హానికరమైన ఆ వ్యర్థాలను ఇన్సినిరేటర్ ద్వారా రూపుమాపాలని, లేని పక్షంలో భూమిలో లోతైన గొయ్యితీసి పూడ్చిపెట్టాలనడం- ఇదెంత నియమబద్ధంగా జరగాల్సిన క్రతువో వెల్లడిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్) వంటివి క్రోడీకరించిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ తనవంతుగా కేరళ కాలుష్య నియంత్రణ మండలి సైతం ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణపై ఇటీవలే సూచనలు వెలువరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం, సాధారణ ఆస్పత్రి వ్యర్థాల్లో 10-25 శాతాన్నే ప్రమాదకరంగా పరిగణిస్తారు. కరోనా విషయంలో అటువంటి లెక్కలు పనికిరావని, అడుగడుగునా జాగ్రత్తలు అత్యవసరమని నిరూపితమైన దరిమిలా- జీవవ్యర్థాల నియంత్రణకు పకడ్బందీ జాతీయ కార్యాచరణ వ్యూహం అత్యావశ్యకమిప్పుడు!
గ్రామీణం కోసం 'కాలినడక డాక్టర్లు'
విశ్వవ్యాప్తంగా ఎనిమిదిన్నర లక్షలకు పైబడిన కరోనా కేసులలో మూడొంతుల మేర అమెరికా, ఇటలీ, స్పెయిన్ సహా ఎనిమిది దేశాల్లోనే నమోదయ్యాయి. వాటిలో ఇరాన్ మినహా తక్కినవి ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణలో ఎప్పటినుంచో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనా సంగతిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. గ్రామీణ ప్రాంతాలకూ వైద్యసేవలు అందాలన్న లక్ష్యంతో 'కాలినడక డాక్టర్ల' వ్యవస్థను ప్రవేశపెట్టి కొన్నేళ్లుగా విజయవంతంగా అమలుపరుస్తున్న చైనా- కరోనా నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన స్పందించడమంటే ఏమిటో లోకానికి చాటింది. కేవలం రోజుల వ్యవధిలో రెండు ప్రత్యేక ఆస్పత్రుల్ని అవతరింపజేసి ప్రపంచ దేశాల్ని అబ్బురపరచిన చైనాయే, సంక్షుభిత వుహాన్‌లో జీవవ్యర్థాల నిర్వహణ ఎలాగో అంతుపట్టక మొదట ఉక్కిరిబిక్కిరైంది. ఒకసారంటూ పరిస్థితి తీవ్రతను ఆకళించుకున్నాక జిన్‌పింగ్ ప్రభుత్వం, ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచింది.
చైనాకు విరుద్ధ దృశ్యమిక్కడ