జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. వైద్యవిద్యా రంగాన్ని పూర్తిగా సంస్కరించే దిశగా భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును సభలో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించాలని చూస్తోంది.
భారతీయ వైద్య మండలి చట్టం-1956ను రద్దు చేసే దిశగా ఈ బిల్లును ప్రతిపాదిస్తోంది. ఎంసీఐ నియంత్రణలోని వైద్య కళాశాలలు లోపభూయిష్టంగా ఉన్నాయని.. అవినీతిమయం అయ్యాయని బిల్లు పేర్కొంటోంది.
వైద్య విద్యా రంగంలో మెరుగైన సంస్కరణల కోసం ఈ బిల్లు ఎంతో తోడ్పడుతుందని లోక్సభలో పేర్కొన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. ఈ నూతనంగా రూపొందిన ఎన్ఎంసీ బిల్లుతో.. భవిష్యత్తులో వైద్య విద్యా రంగంలో సవాళ్లను దీటుగా ఎదుర్కోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.