దేశ రాజధాని దిల్లీ సహా గత ఏడాది నవంబరు నాటి గాలి నాణ్యతతో పోలిస్తే ఈసారి అంతకంటే తక్కువకు పడిపోయిన అన్ని నగరాలు, పట్టణాల్లో టపాసుల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.
దిల్లీ రాజధాని ప్రాంతం(దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు)లో ఈ ఏడాది గాలి నాణ్యత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో.. ఈ నెల 9 అర్ధరాత్రి నుంచి 30 అర్ధరాత్రి వరకు అన్ని రకాల టపాసుల విక్రయం, వినియోగాన్ని నిషేధిస్తూ ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ వెలువరించింది.
"నాణ్యత ఓ మోస్తరు, అంతకంటే తక్కువగా ఉన్న పట్టణాలు, నగరాల్లో హరిత టపాసులను మాత్రమే విక్రయించాలి. దీపావళి, ఛత్, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంలో టపాసులు కాల్చటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సమయాన్ని నిర్దేశించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు సమయాలు కేటాయించకపోతే దీపావళి రోజు రాత్రి 8నుంచి 10గంటల వరకు, ఛత్ పూజ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి"అని ఎన్జీటీ స్పష్టం చేసింది.
దీపావళి సందర్భంగా మహారాష్ట్ర రాజధాని ముంబయిలో టపాసుల అమ్మకాలు, వినియోగంపై 'బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) సోమవారం నిషేధం విధించింది.