ఇండియా ఏనాడూ ఏ ఒక్క సైనికుణ్ని తన సరిహద్దులు దాటించకుండానే 20 శతాబ్దాలపాటు చైనాను సాంస్కృతికంగా ఆక్రమించి, ఆధిపత్యం వహించింది’- అమెరికాలో చైనా రాయబారి హు షి ఒకనాడు చేసిన వ్యాఖ్య అది! అదే ఇండియా నేడు విద్యారంగాన ఏ దిశగా అడుగులు కదపాలో తెలియని అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ఫిన్లాండ్ లాంటి చిన్నదేశాలూ సమర్థ మానవ వనరుల నిర్మాణానికి మేలిమి చదువులే ముడివనరులన్న తెలివిడితో దూసుకుపోతుంటే- చదువుల్లో నాణ్యతను ఎలా సాధించాలన్నదానిపై దశాబ్దాలుగా ఇండియా మల్లగుల్లాలు పడుతోంది.
సంవత్సరాల తరబడి మారని పాఠ్య ప్రణాళికలు, బండెడు పుస్తకాల్ని భారంగా మోస్తూ విద్యార్థులు, శిక్షణ కొరవడిన ఉపాధ్యాయులు, పరిశ్రమలకు అవసరమయ్యే రీతిలో తయారు కాని పట్టభద్రులు... ఇదో విష వలయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఆధునిక సాంకేతికతలు ప్రవేశిస్తున్నా, విప్లవాత్మక పరివర్తన చోటుచేసుకుంటున్నా ఇండియా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే! ఈ పరిస్థితిని మార్చేందుకు, బడుల్లో జ్ఞాన దీపాలు వెలిగించేందుకు విద్యార్థికి అవసరమైన నైపుణ్యాల్ని, విజ్ఞానాన్ని సమకూర్చే నాణ్యమైన బోధన, నవకల్పనలు, పరిశోధనలకు అవకాశం కల్పించే విద్యను అందించాలనే లక్ష్యాలతో కొత్త విద్యావిధానం (ఎన్‌ఈపీ) ముసాయిదా సిద్ధమైంది.
ఇందులో సిఫార్సులు మన విద్యావ్యవస్థలో అవసరమైన పరివర్తనను తీసుకొస్తాయా, జటిల సమస్యల్ని పరిష్కరిస్తాయా అనే సందేహాలు విద్యావేత్తల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన విద్యావిధానం ఆచరణ యోగ్యత, లక్ష్యాలు, సిఫార్సుల అమలులో సాధ్యాసాధ్యాలు తదితర అంశాలపై ‘ఎన్‌ఈపీ’ ముసాయిదా కమిటీ అధ్యక్షులు, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్‌తో ‘ఈనాడు’ డిజిటల్ స్పెషల్ కరస్పాండెంట్ సత్యపాల్ మేనన్ ముఖాముఖి వివరాలివీ..
ప్రశ్న: విద్యావ్యవస్థలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విషయంలో ప్రస్తుత పద్ధతికి, కొత్తగా ప్రతిపాదిస్తున్న 5+3+3+4 విధానానికి తేడా ఏమిటి?
జవాబు: ప్రస్తుత పద్ధతికి బదులుగా 5+3+3+4 విధానాన్ని రూపొందించడానికి చాలా కారణాలున్నాయి. ఇందులో నాలుగు దశలు ఉన్నాయి.
మొదటిది:పునాది దశలో 3-8 ఏళ్ల మధ్య వయసు చిన్నారులకు బడిలో తొలి అయిదేళ్లలో ఎదుగుదల పరంగా తగిన అభ్యసన ఉండేలా చూడటం. ఈ వయసులో చిన్నారుల మెదడు వేగంగా వృద్ధి చెందుతుంది. ఆటలు, ఆవిష్కరణల ఆధారిత అభ్యసన ద్వారా మెదడుకు ఉద్దీపన అవసరమవుతుంది. వాటిని మనం చిన్నారులకు అందించాల్సి ఉంటుంది. పిల్లలకు భాషను నేర్చుకునే సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. అందుకని వారు మూడు భాషల్ని మాట్లాడేలా, వినేలా అభ్యసనం చేయించవచ్చు.
రెండోది:ఈ దశలో 3-5 తరగతుల విద్యార్థులు మరింత వ్యవస్థీకృత అభ్యసన వ్యవస్థ దిశగా పరివర్తన చెందే అవకాశం ఉంటుంది. మాతృభాష/స్థానిక భాష ద్వారా చదవడం, రాయడం, గణితం వంటి అంశాల్లో ప్రాథమిక అక్షరాస్యత పొందేలా చేయాలి.
మూడోది: ఈ దశలో మాధ్యమిక పాఠశాలలో 6-8 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టుల పరిచయం జరుగుతుంది. మాతృభాష, ఆంగ్లం ద్వారా ద్విభాష పద్ధతిలో బోధన చేయవచ్చు. దీనివల్ల రెండు భాషల్లో విద్యార్థులు నైపుణ్యం సాధిస్తారు. ఈ దశలో వృత్తివిద్యనూ పరిచయం చేయవచ్చు. ప్రయోగపూర్వక అభ్యసనపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది.
నాలుగోది: ఈ దశలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులను ఒక సమూహంలా భావించి బోధించాలి. ఇందులో విద్యార్థులు తమ ఆసక్తుల్ని గుర్తించేలా విభిన్న సబ్జెక్టుల మేళవింపు (క్రీడలు, కళలు, మానవ, విజ్ఞాన, సాంఘిక శాస్త్రాలు, సంగీతం, నృత్యం, వృత్తివిద్య)తో బోధన అందించాలి. ఈ దశ చివరికి వచ్చేసరికి నాణ్యమైన విద్యతో విద్యార్థిని తీర్చిదిద్దాలి. దీనివల్ల విద్యార్థులు తమకు ఆసక్తి ఉండే రంగాల్లో ఉపయుక్తమైన వృత్తిజీవితాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ప్ర: మార్పులకు దారితీసే కొత్త సిఫార్సుల గురించి వివరించగలరా?
జ: కాలం చెల్లిన పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలపై ఆధారపడే ప్రస్తుత విద్యావ్యవస్థ స్థానంలో విశ్లేషణ, ఆవిష్కరణ, ప్రయోగపూర్వక అభ్యసనంతో కూడిన వ్యవస్థను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది. పాఠ్యాంశాల భారాన్ని 50 శాతందాకా తగ్గించడం, మదింపు విధానంలో మార్పు తీసుకురావడం అవసరం. పది, పన్నెండో తరగతుల్లో బోర్డు పరీక్షల స్థానంలో ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి వీలయ్యే బోర్డు పరీక్ష పద్ధతిని ప్రవేశపెట్టాల్సి ఉంది. మూల భావనలు, నైపుణ్యాలు, సామర్థ్యాలపైనే విద్యార్థుల్ని పరీక్షించాలి. అదనపు పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు, పాఠ్యాంశాల మధ్య తేడాల్ని తొలగించాలి. సరళమైన పాఠ్యప్రణాళిక అందుబాటులో ఉండే వృత్తి సంబంధ అంశాలను ప్రవేశపెట్టాలి. దీనివల్ల విద్యార్థులు బడిలో ఉన్నప్పుడే తమ ఆకాంక్షలకు అనుగుణమైన అంశాలను గుర్తించి, అభ్యసించడం సాధ్యమవుతుంది.
ప్ర: ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషలతో కూడిన త్రిభాషా సూత్రానికి, కొత్త పద్ధతికి తేడా ఏమిటి?
జ:ఎన్‌ఈపీ-2019లో ప్రతిపాదించిన త్రిభాషా సూత్రానికి 1968, 1986 విధానాల్లో భాగంగా అమలు చేస్తున్న దానికి రెండు తేడాలున్నాయి. మొదటిది... విద్యార్థులకు భాషా అభ్యసన సామర్థ్యం అత్యున్నత స్థాయిలో ఉండే 3-8 ఏళ్ల పునాది దశలోనే మూడు భాషలు మాట్లాడటం, వినడం నేర్పిస్తారు. ఈ దశలో ఒక భాషను చదవడం, రాయడం నేర్చుకుంటారు. జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా ఆధారంగా రెండు, మూడో భాషలను రాయడం, చదవడం తరవాతి దశల్లో క్రమంగా పరిచయం చేస్తారు. రెండోది భాషల ఎంపిక. రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు సొంతంగా ఎంచుకునే అవకాశం ఉంది. బోధన మాధ్యమంగా మాతృభాషను తీసుకున్నా, ఇతర రెండు భాషలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలన్నది ఎన్‌ఈపీ చేస్తున్న సిఫార్సు. ఆంగ్ల భాషను మూడింట ఒక భాషగా దేశమంతటా బోధించవచ్చు. చాలా రాష్ట్రాలు హిందీని మూడింట ఒక భాషగా బోధిస్తున్నాయి. దాన్ని వారు కొనసాగించవచ్చు లేదా తాము ఎంచుకునే భాషను ఉపయోగించుకోవచ్చు.
ప్ర: బోధన మాధ్యమంగా మాతృభాషను ఉపయోగించాలనే సూచన ఆచరణ సాధ్యమేనా? ఒక తరగతిలోని విద్యార్థులను వారి మాతృభాష ఆధారంగా వేరు చేయాలా, వేర్వేరు భాషలకు వేర్వేరు పాఠశాలలు ఉండాలా? ముగ్గురు విద్యార్థుల మాతృభాష వేర్వేరుగా ఉంటే, సదరు మూడు భాషల ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో ఉండాలా?
జ:చాలావరకు స్థానిక ప్రజలు చిన్నారులకు పునాది దశలో మాతృభాషలో బోధించే పాఠశాలలనే ఎంచుకుంటారు. అదే సమయంలో ఆంగ్లం, ప్రాంతీయ భాషను పరిచయం చేస్తారు. ఉదాహరణకు, ఉర్దూ మాట్లాడే వర్గాలు ఆ భాషా మాధ్యమంతో బోధన జరిగే పాఠశాలలకే అనుసంధానత కలిగి ఉంటాయి. దీంతోపాటు ఆంగ్లం, తెలుగు ఇతర భాషలుగా ఉంటాయి. ఒక పాఠశాలలో రెండు విభిన్న భాషలతో కూడిన సెక్షన్లూ ఉండొచ్చు. ఆయా సెక్షన్లకు తగినంత మంది విద్యార్థులు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇవి సూచనాత్మక మార్గదర్శకాలు మాత్రమే. విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాలు ప్రయత్నిస్తే ఇది సాధ్యమవుతుంది.
ప్ర: విద్యావ్యవస్థలో పరివర్తన తీసుకొచ్చే విషయంలో భారతీయ విశ్వవిద్యాలయాలకన్నా, ప్రపంచ విశ్వవిద్యాలయాలే మెరుగనడాన్ని ఎలా సమర్థించుకుంటారు?
జ: భారతీయ విశ్వవిద్యాలయాలకన్నా ప్రపంచ విశ్వవిద్యాలయాలకే ప్రాధాన్యం ఇవ్వడమనేదేమీ లేదు. అత్యున్నతమైన 200 విశ్వవిద్యాలయాలు ఇక్కడికొచ్చి విద్యను అందించవచ్చనే ఒక నిబంధనను మాత్రం చేర్చాం. భారతీయ విశ్వవిద్యాలయ వ్యవస్థ సంక్లిష్టమైన నియంత్రణ పిరిస్థితిలో చిక్కుకొంది. ఆ పరిస్థితి ప్రపంచంలో ఉత్తమమైన వాటితో పోటీ పడటానికి అనువుగా లేదు. ప్రపంచ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాలకున్న సమస్య ఇదే. అత్యుత్తమ భారతీయ విశ్వవిద్యాలయాలు వికసించేలా, నవకల్పనలు జరిపేలా, ప్రపంచ ర్యాంకుల్లో స్థానం దక్కించుకునేందుకు పోటీ పడేలా చేయాలని ఎన్‌ఈపీ-2019 ముసాయిదా ఆశిస్తోంది. మన విశ్వవిద్యాలయాలకు కొంత గడువు, సహకారం, నిధులు సమకూర్చితే అవీ పోటీ పడతాయి.
ప్ర: విద్యావ్యవస్థ, ఆ వ్యవహారాలతో సంబంధమున్న విద్యాసంస్థల విభాగాల్ని విస్తృతంగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయడం, యూజీసీ అధికారాల్లో చాలా వాటిని రద్దు చేయాలనడం వంటి ప్రతిపాదనలు కనిష్ఠ పాలన, పనితీరును సరళతరం చేయడం వంటి అంశాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సిఫార్సును ఎలా సమర్థించుకుంటారు?