తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యారంగంలో కీలక సంస్కరణలు ఇవే.. - national education polocy 2020

విద్యా విధానంలో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చింది కేంద్రం. నూతన విధానంతో విద్యకు కొత్త రూపునిచ్చింది. ఆర్ట్స్, సైన్స్ మధ్య తేడా తొలగించింది. ఉన్నత విద్యలోనూ మాతృభాషకు పట్టం కట్టింది.

national-education-policy-2020-highlights
విద్యారంగంలో కీలక సంస్కరణలు ఇవే..

By

Published : Jul 30, 2020, 8:54 AM IST

Updated : Jul 30, 2020, 9:20 AM IST

దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. కొత్త విధానంలో విద్యను సరళతరంగా మార్చారు.

మానేసినా గుర్తింపు..

ఇప్పటిలాగా... గణితం ఎంచుకున్నవారు చరిత్రపై ఆసక్తి ఉంటే వదలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే... డిగ్రీలో ఓసారి చేరి, ఇష్టం లేకున్నా మూడేళ్ళు తప్పనిసరిగా అదే చదవాల్సిన అవసరమూ లేదు. తమకు ఇష్టం వచ్చిన కాంబినేషన్లలో సబ్జెక్ట్‌లు తీసుకోవచ్చు.... ఇష్టం వచ్చినప్పుడు ఆ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పటి వరకు గుర్తింపు ఇస్తారు. మళ్లీ కుదిరినప్పుడు కొనసాగించవచ్చు. పరిశోధన చేయాలనుకుంటే నాలుగో ఏడాది వరకు ఉండి చేయొచ్చు కూడా! అలా విద్యార్థికి వెసులుబాటు ఉండేలా సబ్జెక్ట్‌ల ఎంపికలో, కోర్సు గడువులో (3-4 ఏళ్ళు) మార్పులు తెచ్చారు. ఇంజినీరింగ్‌ వాళ్ళు ఆర్ట్స్‌ చదివేలా... ఆర్ట్స్‌ ఎంచుకున్నవాళ్ళు సైన్సూ చదివేలా ఏర్పాటు చేస్తారు.

  • తొలి సంవత్సరం: సర్టిఫికెట్‌
  • రెండో ఏడాది: అడ్వాన్స్‌ డిప్లమో
  • మూడో ఏడాది: బ్యాచిలర్‌ డిగ్రీ
  • నాలుగో ఏడాది: పరిశోధనతో కూడిన బ్యాచిలర్‌ డిగ్రీ ఇస్తారు.

టీచర్‌ కావాలంటే ఇక...

ఉపాధ్యాయ సామర్థ్యాలపై కొత్త విధానంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఉపాధ్యాయుల నియామకాలను ఇకమీదట పారదర్శక-పటిష్ఠ పద్ధతిలో చేపడతారు.

  • బోధన పట్ల నిబద్ధత, తపన ఉన్నవారు
  • అకడమిక్‌గా, బోధనాపరంగా, పరిశోధనపరంగా, ప్రజాసేవ పట్ల అంకితభావాలను కూడా పరీక్షించి తీసుకుంటారు.
  • వారి సామర్థ్యాల్ని మదించిన తర్వాతే... పదోన్నతులుంటాయి.
  • ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తారు.

ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌ మాతృభాషలో?

భారతీయ భాషలకు, మాతృభాషలకు కొత్త విద్యావిధానం పెద్దపీట వేస్తోంది. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌, ఇంటర్‌ప్రెటేషన్‌ (ఐఐటీఐ), పాళి, పెర్షియన్‌, పాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి... అన్ని ఉన్నతవిద్యా సంస్థల్లో వీటి విభాగాలుండేలా చూస్తారు. ఉన్నత విద్యలోని అనేక కోర్సులను మాతృభాషల్లో, స్థానిక భాషల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు.

ఏ భాషనూ రుద్దకూడదు...

స్కూల్‌ నుంచి మొదలెడితే... ఉన్నత విద్య వరకు ప్రతిదశలోనూ సంస్కృతం ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంటుంది. మిగిలిన భాషలు కూడా తీసుకోవచ్చు. ఏ భాషనూ విద్యార్థిపై బలవంతంగా రుద్దరు. సెకండరీ స్థాయిలో విదేశీవిద్యల్ని కూడా పరిచయం చేస్తారు.

3, 5, 8లోనే పరీక్షలు

3, 5, 8 తరగతుల్లోనే స్కూల్‌ పరీక్షలుంటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్వహిస్తారు. 10, 12 తరగతులకు యధావిధంగానే పరీక్షలుంటాయిగాని... వాటి తీరు మారుతుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా... వారి జ్ఞానాన్ని, విశ్లేషణలను ఇతరత్రా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం పరాఖ్‌ (విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, విశ్లేషించే సంస్థ)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తివిద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తివిద్యలో ప్రవేశం ఉంటుంది.

ఎంబీబీఎస్‌ చేస్తూ కోడింగూ...

ఇప్పటిదాకా వృత్తివిద్యా కోర్సులది పూర్తిగా ప్రత్యేక దారి. సాంకేతిక విద్య, లా, వ్యవసాయ విద్య, వైద్యం, ఆరోగ్యం... ఇలా వేటికవే విడివిడిగా సాగుతున్నాయి. వీటన్నింటినీ ఉన్నతవిద్యలో భాగం చేసి... మల్టీడిసిప్లినరీగా వెసులుబాటు కల్పిస్తారు. అంటే... ఎంబీబీఎస్‌ చేస్తూనే కావాలంటే కోడింగ్‌ కూడా నేర్చుకోవచ్చు.

ఇదీ చదవండి:బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్ర మృతి

Last Updated : Jul 30, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details