తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 918 కేసులు - coronavirus treatment

భారత్​లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారికి ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్రలో కేసుల సంఖ్య 1,982కు చేరింది. దిల్లీలో 43 ప్రదేశాలను వైరస్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. తమిళనాడులో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా భారత్​లో 8,447 మందికి వైరస్ సోకింది. 273మంది ప్రాణాలు కోల్పోయారు.

nation corona
దేశంలో కరోనా విజృంభణ.. ఎనిమిదివేలకు పైగా కేసులు

By

Published : Apr 13, 2020, 6:19 AM IST

ప్రపంచదేశాలను కరోనా వైరస్​ వణికిస్తోంది. భారత్​లోనూ ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య, మరణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో దిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే భారత్​లో 918 వైరస్ కేసులు నమోదయ్యాయి. 34మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత్​లో కరోనా గణాంకాలు

మహారాష్ట్రలో రెండువేలకు చేరువలో..

మహారాష్ట్రపై కొవిడ్​-19 పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 221మంది వైరస్ బారిన పడ్డారు. కేసుల సంఖ్య 1,982కు చేరింది. రాష్ట్రంలో మొత్తంగా 149 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. సోలాపూర్​లో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ ప్రాంతంలో ఇదే తొలి కరోనా కేసు. పుణె జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 286కు చేరగా... 31 మంది చనిపోయారు.

దిల్లీలో 43 వైరస్ ప్రభావిత ప్రాంతాలు..

ఆగ్నేయ దిల్లీలో మరో 12 వైరస్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు అధికారులు. ఫలితంగా దిల్లీలో కరోనా ప్రభావిత ప్రాంతాల సంఖ్య 43కు పెరిగింది. ఇప్పటివరకు దేశ రాజధానిలో 1,069 కేసులు నమోదయ్యాయి. ఆదివారం మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 19కి చేరింది.

ఆశారేఖ.. కేరళ

కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు 36మందికి కరోనా నయమైంది. తాజాగా ఇద్దరికి వైరస్​ సోకింది. ఆ రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యమయింది.

తమిళనాడు.. వెయ్యిదాటిన కేసులు

తమిళనాడులో కొత్తగా 106 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. మొత్తంగా 11మంది ప్రాణాలు కోల్పోయారు.

యూపీలో మరో ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో మరో 31మందికి కరోనా సోకిందని నిర్ధరణ అయింది. ఈ రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 483కు చేరింది.

తబ్లీగీలతో చత్తీస్​గఢ్​లో..

చత్తీస్​గఢ్​లో పదమూడు మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 31కి చేరింది. తాజాగా వ్యాధి నిర్ధరణ అయిన వారికి తబ్లీగీ జమాత్​ కార్యక్రమంతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారంతా స్థానికంగా ఉన్న ప్రార్థనా స్థలంలో తబ్లీగీలతో కలిశారని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​లో కొవిడ్-19 కేసుల సంఖ్య 572కు చేరింది. రాష్ట్రంలో తాజాగా నలుగురు వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన ఇండోర్​లో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు భోపాల్​లో కరోనా తో చనిపోయారు.

గుజరాత్​లో 24మంది..

గుజరాత్​లో వైరస్ కారణంగా ఆదివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 24కు చేరింది. మొత్తంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 516కు పెరిగింది.

ఒడిశాలో పెరిగిన కేసులు..

ఒడిశాలో మరో నలుగురికి వైరస్ సోకింది. మొత్తంగా రాష్ట్రంలో 54 మంది వైరస్ బారిన పడ్డారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,551 మందికి పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్ అతిక్రమిస్తే గదిలోకి నెట్టి 'మసాకలి 2.0'!

ABOUT THE AUTHOR

...view details