తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వచ్ఛంద కర్ఫ్యూకు యావత్​ భారతం సిద్ధం - జనతా కర్ఫ్యూ ఎందుకు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశకు చేరిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో స్వచ్ఛంద కర్ఫ్యూకు దేశం సిద్ధమయింది. ఇందుకు సంబంధించి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకున్నాయి. ఇప్పటికే అనేక రైళ్లు నిలిచిపోగా.. పలు నగరాల్లో మెట్రో సేవలు రద్దు కానున్నాయి. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు యావద్దేశం షట్​డౌన్​ కానుంది.

janata curfew
జనతా కర్ఫ్యూ

By

Published : Mar 22, 2020, 5:16 AM IST

Updated : Mar 22, 2020, 6:32 AM IST

కరోనా వ్యాప్తిని కట్టడి కోసం ఇళ్లలోనే ఉండిపోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతం జనతా కర్ఫ్యూకు సిద్ధమయింది. కర్ఫ్యూలో భాగంగా వివిద కేంద్ర ప్రభుత్వ విభాగాలు అన్ని చర్యలూ తీసుకున్నాయి.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అత్యవసర సేవలు మినహా దుకాణాలు, షాపింగ్‌మాళ్లు, థియేటర్లు ఉదయం 7 నుంచి సాయంత్రం 9 వరకు షట్‌డౌన్‌లోనే ఉండనున్నాయి. కొన్ని రాష్ట్రాలు కొద్ది రోజుల పాటు పూర్తిస్థాయి లేదా పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.

3 వేల రైళ్ల నిలిపివేత..

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ విభాగాలు జనతా కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. రైల్వే శాఖ గత అర్ధరాత్రి నుంచి ఇవాళ రాత్రి 10గంటల మధ్య అనేక రైళ్లు నిలిచిపోగా.. మరికొన్ని పరిమితంగా నడుస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ రాత్రి 10 గంటల మధ్య నడిచే అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌రైళ్లు, ఇంటర్ సిటీ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లు గమ్యస్థానం చేరిన తర్వాత నిలిచిపోనున్నాయి.

దాదాపు 3 వేల రైళ్లు ఆగిపోయాయి. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, సికింద్రాబాద్‌ సబర్బన్‌ రైళ్లు చాలా పరిమితంగా నడుస్తున్నాయి. ముంబయి సబర్బన్ రైళ్లను పూర్తిగా నిలిపేశారు. రైల్వే స్టేషన్లలోని ఫుడ్‌ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్‌ రూములు, జన ఆహార్‌, సెల్‌కిచెన్లు మూతపడ్డాయి.

దేశీయ విమానయాన సంస్థలు పరిమితంగా నడుస్తున్నాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌లో బస్సు సర్వీసులు నిలిపేస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో 50శాతం మాత్రమే నడుస్తున్నాయి. ముంబయి, హైదరాబాద్‌లలో మెట్రో రైలు సేవలు రద్దయ్యాయి.

అన్ని రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్‌లు సాయంత్రం 9 వరకు షట్‌డౌన్‌లో ఉండనున్నాయి. అత్యవసర సేవలు మినహా ఇక ఏ దుకాణమూ తెరుచుకోవడం లేదు.

రాష్ట్రాల వారీగా..

  • ఒడిశాలోని 5 జిల్లాలు, 8 పట్టణాల్లో వారం పాటు పూర్తిగా బంద్‌
  • రాజస్థాన్‌లో అత్యవసర సేవలు మినహా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్
  • పంజాబ్‌లోని నాలుగు జిల్లాల్లో మూడు రోజుల పాటు షట్​డౌన్​
  • బిహార్‌లో ఇవాళ పూర్తి బంద్‌ కొనసాగనుండగా రేపటి నుంచి 31 వరకు పాక్షిక బంద్‌
  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లో అత్యవసర దుకాణాలు మినహా మిగిలినవన్నీ బుధవారం వరకు మూసివేత
  • గోవాలో అన్ని చర్చిల్లో నేడు సామూహిక ప్రార్ధనలు రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ఆర్చి బిషప్‌ ప్రకటన
  • దిల్లీ చర్చిల్లోనూ సామూహిక ప్రార్థనలు రద్దు
  • కశ్మీర్‌లోని తమపరిధిలో ఉన్న మసీదుల్లో ఇవాళ ప్రార్థనలు నిలిపేయాలని కశ్మీర్ వక్ఫ్ బోర్డు సూచన
  • దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలను వారి బంధువులతో ములాఖత్​లు రద్దు

చప్పట్లతో సంఘీభావం...

దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా సాయంత్రం 5 గంటలకు దేశప్రజలు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అగ్నిమాపకదళాలు, పోలీసులు, ఇతర అధికారులు వాళ్ల వాహనాల సైరన్‌లు లేదా బెల్లులు మోగించి వైద్యులకు కృతజ్ఞతలు చెప్పేలా ఆదేశించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు చేశారు.

జనతాకర్ఫ్యూకి అందరూ మద్దతు తెలిపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు దేశ ప్రజలకు సూచించారు.

Last Updated : Mar 22, 2020, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details