తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌర ఆందోళనలకు 300 మంది ప్రముఖుల మద్దతు - పౌర నిరసనలు

సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నవారికి మద్దతు ప్రకటించింది 300మందితో కూడిన మేధావులు, నటులు, రచయితల బృందం. సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన చేపడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ బహిరంగ ప్రకటన చేశారు ప్రముఖులు.

CAA-PERSONALITIES-STATEMENT
CAA-PERSONALITIES-STATEMENT

By

Published : Jan 26, 2020, 7:28 PM IST

Updated : Feb 25, 2020, 5:16 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, మహిళలకు దేశంలోని ప్రముఖ మేధావులు, నటులు, రచయితలు సంఘీభావం తెలిపారు. వీరిలో బాలీవుడ్​ నటుడు నసీరుద్దీన్​ షా, చిత్ర నిర్మాత మీరా నాయర్​, గాయకుడు టీఎం కృష్ణ, రచయిత అమితావ్​​ ఘోష్​, చరిత్రకారిణి రోమిలా థాపర్​ తదితరులు ఉన్నారు.

ఇండియన్​ కల్చరల్​ ఫోరం ద్వారా దేశంలోని సుమారు 300 మంది ప్రముఖ వ్యక్తులు బహిరంగ ప్రకటన చేశారు. సీఏఏ, ఎన్​ఆర్​సీ దేశ ఆత్మకు ప్రమాదకారిగా మారుతాయని ఆరోపించారు.

"సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులు, మహిళలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం వాళ్లు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం.

మేం చాలా సార్లు ఇచ్చిన వాగ్దానాలపై నిలబడలేదు. అన్యాయాన్ని ఎదిరించాల్సిన సమయంలో మాలో చాలామంది మౌనంగా ఉండిపోయారు. కానీ ఈ సమయంలో మేం అలా ఉండలేకపోతున్నాం."

- ప్రముఖుల ప్రకటన

'ఆ దేశాలే ఎందుకు?'

ఎలాంటి చర్చకు అవకాశం లేకుండా ప్రస్తుత ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తుందని ప్రముఖులు ఆరోపించారు. ఇది లౌకిక విధానాన్ని ధ్వంసం చేస్తుందని పేర్కొన్నారు. ఇది జాతీయతకు ప్రమాదకారిగా పరిణమిస్తుందని.. లక్షలాది మంది భారతీయుల జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుందని తెలిపారు. ఎన్ఆర్​సీలో పత్రాలు చూపెట్టలేని వారికి సీఏఏ ద్వారా పౌరసత్వం వస్తుందనీ.. కానీ ఆ అవకాశం ముస్లింలకు లేదని వారు అన్నారు.

సీఏఏ ద్వారా పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​ దేశాల వలసలకే ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారని వారు ప్రశ్నించారు. మయన్మార్​, చైనా, శ్రీలంకల్లోనూ మైనారిటీల పీడనకు గురవుతున్నారని తెలిపారు. వారిని ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసుల క్రూరత్వంతో వేలాది మంది విద్యార్థులు గాయపడ్డారని ప్రకటనలో విమర్శించారు.

Last Updated : Feb 25, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details