తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ల్యాండర్ విక్రమ్​ జాడను కనుగొన్న నాసా - A NASA satellite orbiting the Moon has found India's Vikram lander which crashed on the lunar surface in September

చంద్రయాన్-2 ప్రయోగంలో చివరి నిమిషంలో విఫలమైన ల్యాండర్​ విక్రమ్​ జాడను గుర్తించినట్లు పేర్కొంది నాసా. తమ లూనార్‌ రీకనైసాన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో) విక్రమ్​ శకలాలను గుర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు జాబిల్లిపై శకలాలు ఉన్న చిత్రాన్ని విడుదల చేసింది.

vikram
విక్రమ్​ను గుర్తించిన  అమెరికా ఆర్బిటార్

By

Published : Dec 3, 2019, 8:31 AM IST

చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలోకి వెళ్లి కూలిన చంద్రయాన్-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ జాడను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కనిపెట్టింది. నాసాకు చెందిన లూనార్‌ రీకనైసాన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో).. విక్రమ్‌ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది. ఈ మేరకు చిత్రాలను తీసి పంపింది. విక్రమ్ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాల్లో పడ్డట్లు గుర్తించింది.

షణ్ముగ సుబ్రహ్మణియన్‌ అనే వ్యక్తి విక్రమ్‌కు సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు నాసా ప్రకటించింది. విక్రమ్‌ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాన్ని షణ్ముగం గుర్తించినట్లు పేర్కొంది. అనంతరం ఎల్‌ఆర్‌వో ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను సైతం గుర్తించినట్లు నాసా పేర్కొంది. అక్టోబర్ 14, 15, నవంబర్‌ 11 ఈ చిత్రాలను తీసి ధ్రువీకరించినట్లు వెల్లడించింది.

పైచిత్రంలో నీలి రంగులో ఉన్న చుక్కలు విక్రమ్ వల్ల ప్రభావితమైన చంద్రుడి ఉపరితలాన్ని.. ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చుక్కలు విక్రమ్‌ శకలాల్ని సూచిస్తున్నాయి. ‘ఎస్‌’తో సూచించిన శకలం షణ్ముగం సుబ్రహ్మణియన్‌ కనిపెట్టింది.

* విక్రమ్‌ శకలాలు పడడానికి ముందు, పడిన తర్వాత చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో కూడా నాసా చిత్రాలు విడుదల చేసింది.

వాస్తవానికి విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ముందుగా నిర్ధరించిన ప్రాంతాన్ని ఎల్‌ఆర్‌వో సెప్టెంబరు 17నే తన చిత్రాల్లో బంధించింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో చీకటిగా ఉండడంతో ల్యాండర్‌ని కచ్చితంగా గుర్తించలేకపోయారు. చిత్రాలు తీసిన సమయంలో విక్రమ్‌ దట్టమైన నీడలో ఉండే అవకాశం ఉందని అప్పట్లో ప్రకటించారు. అక్టోబర్‌లో వెలుతురు ఉండడంతో జాడను కచ్చితంగా కనుగొనడానికి సాధ్యమైంది. వాటిని మరింత పరిశోధించి అవి విక్రమ్‌ శకలాలే అని నిర్ధరించుకొని తాజాగా చిత్రాలు, వివరాలు వెల్లడించారు.

సెప్టెంబర్‌ 7న చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విక్రమ్‌ జాడను కనుగొనేందుకు ఇటు ఇస్రోతో పాటు అటు నాసా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు విక్రమ్‌ చివరి క్షణంలో తప్పటడుగులు వేయడానికి గల కారణాలేంటో ఇస్రో ఇప్పటికే విశ్లేషించింది. సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్లే ల్యాండింగ్‌లో లోపం తలెత్తిందని గుర్తించారు.

ఇదీ చూడండి: మోదీ బంపర్​ ఆఫర్​.. శరద్​ పవార్​ నో..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details