నదీ జలాల వివాద పరిష్కారం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు కుటుంబమే పరమావధి అని, ఇన్నేళ్ల కుటుంబ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ది రాచరిక పాలన అని, వారి హయాంలో దేశాభివృద్ధి కుంటుపడిందని తమిళనాడులోని రామనాథపురం బహిరంగ సభలో మోదీ ఆరోపించారు.
"మా మేనిఫెస్టో.. సంకల్ప పత్రంలో నదీ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక స్థానం కల్పించాం. మే 23న మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు 'జలశక్తి' అనే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. జలాలకు సంబంధించి అనేక అంశాలపై ఈ శాఖ దృష్టి సారిస్తుంది. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటితో పాటు వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం."