తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో 2.0: కొత్త సర్కారుకు సవాళ్ల స్వాగతం - ఎన్​డీఏ

హోరాహోరీ సంగ్రామం ముగిసింది. మోదీ సేన తిరుగులేని విజేతగా నిలిచింది. మరోమారు అధికార పగ్గాలు చేపట్టింది. తర్వాత ఏంటి? 'నమో 2.0' సర్కార్​ ముందు ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? వాటిని అధిగమించేందుకు కొత్త ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి?

నమోకు కొత్త సవాళ్లు

By

Published : May 31, 2019, 5:23 AM IST

నమోకు కొత్త సవాళ్లు

దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభంజనం మరోసారి ఎన్డీఏకు ఘన విజయం సాధించిపెట్టింది. 2014 కంటే మించిన గెలుపును భాజపాకు అందించింది. మోదీ ఐదేళ్ల పాలనకు ఈ తీర్పు ప్రజామోదం అని కమలనాథులు గర్వంగా చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలకు సార్వత్రిక ఎన్నికల ఫలితమే సమాధానమని విశ్లేషిస్తున్నారు.

భాజపా నేతృత్వంలోని ఏన్డీఏ ఎంతటి ఘన విజయం సాధించినా... ప్రస్తుతం దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చాలా ముఖ్యం. పెద్ద సమస్యలేం లేవని భాజపా నేతలు కొందరు చెబుతున్నా... వాస్తవ పరిస్థితిని విస్మరించలేం. తిరుగులేని ఆధిక్యంతో రెండోసారి ప్రధాని పీఠం అధిష్ఠించిన మోదీకి కీలక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.

వృద్ధిలో ఒడుదొడుకులు

భాజపా హయాంలో 2014 నుంచి 2016 మధ్య ప్రగతి రథం పరుగులు పెట్టింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ అవతరించింది. 2016లో నోట్ల రద్దుతో లెక్క తప్పింది. 2016 జనవరిలో 9.3 శాతంగా ఉన్న వృద్ధిరేటు 2017 జులై నాటికి 6 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత కొంచెం కోలుకొని 2018 జులై నాటికి 8 శాతానికి చేరుకుంది. మళ్లీ అప్పటి నుంచి తిరోగమన దిశలోనే వృద్ధి సాగుతోంది. ప్రస్తుతం జీడీపీ వృద్ధిరేటు 6.3శాతం వద్ద కొనసాగుతోంది. ఇది కాస్త కలవరపెట్టే అంశమే.

పెట్టుబడులే సమస్య

దేశంలో పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మేకిన్​ ఇండియా అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఆశించిన స్థాయిలో లేదు. పరిశ్రమల అనుమతుల మంజూరులో తెచ్చిన మార్పులు సానుకూల ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఎగుమతులపై ప్రభావం పడింది. కొత్త ఉద్యోగాల కల్పన తగ్గిపోయింది. పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన ఇబ్బందిగా మారింది ప్రభుత్వానికి.

భాజపా ఐదేళ్ల పాలనలో ముఖ్యంగా బ్యాంకింగ్​ రంగంపై విస్తృత చర్చ జరిగింది. అనేక అవకతవకలు బయటపడ్డాయి. మొండిబకాయిలు బ్యాంకులకు తలనొప్పిగా మారాయి. రూ.వేల కోట్ల మొండి బకాయిల భారంతో బ్యాంకులు కునారిల్లుతున్నాయి. బ్యాంకింగ్​ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడం, వేల కోట్ల రుణాలు చెల్లించకుండా విదేశాల్లో తలదాచుకుంటున్న మాల్యా లాంటి వారిని దేశానికి తీసుకురావడం మోదీ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్​.

పెరుగుతున్న నిరుద్యోగం

ఉపాధి కల్పన.... 2014 ఎన్నికల్లో భాజపా ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది. ఏటా 2 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నది వారి మాట. ఆ హామీ నెరవేరిందా అంటే మౌనమే సమాధానం. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల నిరుద్యోగం సమస్య పెరిగిపోయిందన్నది ఆర్థిక నిపుణులు, విపక్ష నేతల వాదన. ఈ రెండు సంస్కరణల వల్ల దాదాపు కోటి 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెబుతూ సెంటర్​ ఫర్​ మానిటరింగ్​ ఇండియన్​ ఎకానమీ(సీఎంఐఈ) ఈ ఏడాది జనవరిలో నివేదిక విడుదల చేసింది.

నిరుద్యోగం 2012తో పోల్చితే 40 ఏళ్ల గరిష్ఠానికి అంటే... 6.1 శాతానికి చేరిందని ఇటీవల లీకైన ఎన్​ఎస్​ఎస్​ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అదే సంస్థ 2012లో విడుదల చేసిన నివేదికలో నిరుద్యోగ శాతంగా 2.7గానే ఉంది.

ఏటా కోటి 20 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. వారిలో కేవలం 47 లక్షల మందికే ఉపాధి దొరుకుతోందని ఇండియా స్పెండ్​ అనే సంస్థ వెల్లడించింది. మిగతా వారు నిరుద్యోగులుగా మారిపోతున్నారని చెప్పింది.

మోదీ సర్కారు ముందున్న ప్రధాన సవాళ్లలో​ నిరుద్యోగం ఒకటి. ఈ సమస్య పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో వేచిచూడాలి.

ధరల భూతానికి కళ్లెం వేయడం

ద్రవ్యోల్బణం విషయంలో దేశీయంగా కాస్త సానుకూల పరిస్థితి ఉన్నా... అంతర్జాతీయ పరిణామాలు సవాలు విసురుతున్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలకు రెక్కలొచ్చే అవకాశముంది. ఇరాన్​పై అమెరికా ఆంక్షలు ఇందుకు ప్రధాన కారణం. అమెరికా-ఇరాన్​ గొడవ సద్దుమణగకపోతే పెట్రో ధరల్ని అదుపులో ఉంచడం కష్టమే. చమురు ధరల పెరుగుదల అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది.

పాక్​తో ఎలా..?

విదేశాంగ విధానంలో తొలి ఐదేళ్లలో ప్రత్యేక ముద్ర వేశారు నరేంద్రమోదీ. ఇబ్బంది అంతా పొరుగు దేశం పాకిస్థాన్​తోనే. ఎన్నిసార్లు స్నేహ హస్తం అందించినా... పాక్​ తీరు మారలేదు. పఠాన్​కోట్​, ఉరీ, పుల్వామా ఉగ్రదాడులకు దీటుగా బదులిచ్చింది భారత్. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ అధినేత మసూద్​ అజార్​​ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం భారత్​కు దక్కిన అతి పెద్ద దౌత్య విజయం.

కొత్త ప్రభుత్వం పాక్​పై కఠిన వైఖరి కొనసాగించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ను ఆహ్వానించకపోవడం ద్వారా మోదీ ఈ సంకేతాలు ఇచ్చారన్నది నిపుణుల మాట.

ట్రంప్​తో అంతా ఓకే కానీ..

మోదీ ప్రధాని అయ్యాక అగ్రరాజ్యం అమెరికాతో బంధాలు మెరుగుపడ్డాయి. అయితే... అమెరికా ఎగుమతులపై భారత్​ విధిస్తున్న పన్నులపై అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. భారత్​ ఎగుమతులపై తమ దేశంలోనూ సుంకాలు పెంచుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ట్రంప్​తో మోదీ భేటీ అయ్యే అవకాశముంది. అమెరికాతో వాణిజ్య చర్చలను మోదీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళుతుందనేది ఆసక్తికరం.

సంక్షేమ రథానికి స్పీడ్​ బ్రేకర్లు

కొన్ని భాజపాయేతర రాష్ట్రాల్లో కేంద్ర పథకాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రులు అంగీకరించడం లేదు. వేరే పేర్లతో ఇప్పటికే ఈ తరహా పథకాలు అమలులో ఉండడం ఒక కారణం. కేంద్ర పథకాలతో ప్రజలకు పెద్దగా లబ్ధి చేకూరదన్నది మమత, నవీన్​ పట్నాయక్​ వంటి వారి వాదన. ఇలా ఆయుష్మాన్​ భారత్​ అమలు ప్రశ్నార్థకంగా మారింది. దేశంలోని 50కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రధాని ఘనంగా ప్రకటించినా... ఆ పథకం ముందుకు సాగింది లేదు.

భాజపాయేతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూడడం ప్రధాని మోదీకి సవాలే. లేదంటే... పేదల సంక్షేమం కోసమే పని చేస్తున్నామన్న భాజపా నేతలు మాటలు... ప్రకటనలుగానే మిగిలిపోయాయన్న భావన కలిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్​, ఇతర ఎన్డీఏయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో భాజపా బలపడేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ఎంతో అవసరం.

ఇదీ చూడండి: జంబో కేబినెట్​కు మోదీ-షా కసరత్తు

ABOUT THE AUTHOR

...view details