కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్లో అనినీతికి పాల్పడిన 111 ఆసుపత్రులను ఏబీ-పీఎంజేఏవై వెబ్సైట్లో "నేమ్ అండ్ షేమ్" పేరుతో పొందుపరిచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ-పీఎంజేఏవై) మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఆరోగ్య మంథన్' ను ఉద్దేశించి వర్ధన్ మాట్లాడారు.
అదే విధంగా ఈ పథకం కింద బాగా పనిచేస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు, ఆసుపత్రులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం "నేమ్ అండ్ ఫేమ్" అమలు చేయాలని యోచిస్తోందన్నారు.
అవినీతిని సహించబోం...
అవినీతికి పాల్పడితే తమ ప్రభుత్వం ఏమాత్రం సహించదని అన్నారు. ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద సుమారు 1200 కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైందన్నారు. 338 దవాఖానాలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆరు ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, కొన్నింటిపై రూ.1.5 కోట్లకు పైగా జరిమానా విధించామని హర్షవర్ధన్ తెలిపారు.
ఈ నెల 23 నాటికి ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికి 47 లక్షలకు పైగా చికిత్సలకు ప్రభుత్వం రూ .7,500 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.
ఇదీ చూడండి : చైనా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం- 19 మంది మృతి