కరోనా.. కొన్ని దేశాల్లో ఉద్ధృతంగా ఉంటే, మరికొన్ని దేశాల్లో ఎందుకు తక్కువగా ఉంది? న్యూయార్క్, లండన్‌లు అల్లాడిపోతుంటే.. భారత్, థాయ్‌లాండ్‌లోని నగరాలు వాటితో పోలిస్తే కాస్త ప్రశాంతంగా ఎందుకు ఉన్నాయి? నిపుణుల మదిని తొలిచి వేస్తున్న ప్రశ్నలివే. ఎన్నో క్షేత్రస్థాయి అంశాలను పరిశీలించిన తరువాత ‘నమస్తే’ చెప్పడం వంటి సంప్రదాయాలు, ఇళ్లలోనే వృద్ధులను ఆదరించడం వంటి సంస్కారాలే మహమ్మారి విస్తరణను అడ్డుకున్నాయని గుర్తించారు. అందుకే అమెరికా, బ్రిటన్‌లతో పోల్చితే భారత్, థాయ్‌లాండ్‌ల్లో కేసులు తక్కువగా ఉన్నాయి.
'నమస్తే'తో కరోనా మహమ్మారి దూరం - నమస్తేతో కరోనా వైరస్‌కు చెల్లు
భారతీయుల 'నమస్తే' సంప్రదాయం ఇప్పుడు ఓ వరంలా మారిందని న్యూయర్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. అమెరికా, బ్రిటన్ దేశాల కన్నా భారత్‌లో వైరస్ తక్కువగా ఉండటానికి దీనిని ఓ కారణంగా పేర్కొంది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం...కరోనా తీవ్రతకు నాలుగు కారణాలు ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనాభా, సంస్కృతి, పర్యావరణం, ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలపైనే కరోనా ఉద్ధృతి ఆధారపడింది. ఆయా దేశాల్లోని సంస్కృతి కూడా కరోనా వ్యాప్తిని అరికట్టినట్టు తేలింది. ‘నమస్తే’ చెప్పే సంప్రదాయం కారణంగా వ్యక్తులు సహజంగానే భౌతిక దూరం పాటించారు. ఇదొక వరంలా మారింది. భారత్ వంటి దేశాల్లో వృద్ధులను ఇళ్లల్లోనే సాకడం ఆచారం. ఇది కూడా వ్యాప్తిని అడ్డుకొంది. పాశ్యాత్యదేశాల్లో వృద్ధులను ఆశ్రమాల్లో ఉంచడంతో వారే ఎక్కువగా వ్యాధికి గురయ్యారు. ఆసుపత్రుల్లో చేర్చినా అవి కిక్కిరిసిపోయాయి. అందుకే మృతుల సంఖ్య పెరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో అధిక సంఖ్యలో వృద్ధులే ఉండడం గమనార్హం.