దేశలో ఉల్లిధరలు కొండెక్కిన వేళ నాఫెడ్ చర్యలకు ఉపక్రమించింది. దేశంలో ఉల్లి లభ్యతను పెంచడం సహా.. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఉల్లిని దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగా నవంబర్ 20లోగా 15వేల టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయడానికి దిగుమతిదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది. 40నుంచి 60 ఎంఎం సైజులో ఉన్న ఉల్లిపాయలను కేజీ యాభై చొప్పున సరఫరా చేయాలని నాఫెడ్ కోరుతోంది.
నవంబర్ నాలుగో తేదీకి బిడ్డింగ్ ప్రక్రియ ముగుస్తుందన్న నాఫెడ్... మరుసటి రోజు టెండర్లు తెరుస్తామని వెల్లడించింది. జవహార్లాల్ నెహ్రూ, కండ్లా పోర్టుల్లో డెలివరీ ఉంటుందని తెలిపింది.
" 15వేల టన్నుల ఎర్రఉల్లి దిగుమతుల కోసం టెండర్లు ఆహ్వానించాం. ఈ చర్య దేశీయ సరఫరా పరిస్థితులు మెరుగయ్యేందుకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఉల్లి నాణ్యత, సత్వర సరఫరా, ఎంత దిగుమతి చేస్తారనేదానిపై ఆధారంగా బిడ్లను అంచనా వేస్తాం. బిడ్డర్లు తాజా, బాగా ఎండిన, ప్రాసెస్ చేసిన ఉల్లిపాయలను సరఫరా చేయాలి. ఎక్కువ మంది ఇందులో పాలుపంచుకునేందుకు కనీస బిడ్ పరిమాణాన్ని 2వేల టన్నుల నుంచి వెయ్యి టన్నులకు తగ్గించాం. "