హరియాణాకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్ లాల్ ఖట్టర్ 1954లో రోహ్తక్లోని బనియానీలో జన్మించారు. రోహ్తక్లోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు.
రాజకీయ జీవితం...
1977లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో చేరారు ఖట్టర్. మూడేళ్ల అనంతరం.. పూర్తి స్థాయి ప్రచారక్‌గా మారిన ఆయన.. అలాగే 14 సంతవత్సరాల పాటు కొనసాగారు. దానికి కట్టుబడి జీవితకాలం బ్రహ్మచారిగానే ఉన్నారు.
2000 నుంచి 2014 వరకు ఖట్టర్... హరియాణా భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్ర భాజపా విభాగ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అనంతరం.. భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ఆయనకు స్థానం లభించింది.
తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ.. విజయం...
2014 హరియాణా ఎన్నికల్లో కర్నాల్ నియోజకవర్గం నుంచి ఖట్టర్... ఎమ్మెల్యేగా గెలిచారు. ఖట్టర్ కర్నాల్ స్థానికుడు కాదని... ప్రత్యర్థులు ఎన్నికల ప్రచారంలో విమర్శించినా మోదీ అనుకూల పవనాల తాకిడికి కొట్టుకుపోయాయి. ఆయనకు విజయం కట్టబెట్టాయి.
హరియాణాలో తొలిసారిగా భాజపా ఆధిక్యంలో నిలిచింది. అధికారంలోకి వచ్చింది. ఖట్టర్‌ను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించింది అధిష్ఠానం. అలా... భాజపా తరఫున హరియాణా తొలి సీఎంగా ఖట్టర్ సేవలందించారు.