కర్ణాటక మైసూరు దసరా ఉత్సవాలకు ఎనలేని పేరు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ వేడుకల్లో గజరాజులతో జంబూ సవారీ కీలకఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన గజరాజుతోపాటు అందంగా ముస్తాబైన మరికొన్ని ఏనుగులు ఈ ఊరేగింపులో పాల్గొంటాయి. ఈ వేడుక సోమవారం నిర్వహించనున్నారు.
ఈసారి చిన్నగానే..
వందల ఏళ్లుగా ప్రతి సంవత్సరం జరిగే ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా ప్రజలు హాజరయ్యేవారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో సింపుల్‌గానే వేడుక చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు. ఫలితంగా జంబూ సవారి పరేడ్ కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కరోనా నేపథ్యంలో ఈసారి కేవలం 300 మందికే ఆహ్వానం అందింది. అయితే ఈ కార్యక్రమాన్ని చందన టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
జంబూ సవారీ వర్కవుట్‌గా పిలిచే తలీమ్ పూర్తయ్యాక.. సీఎం యడియూరప్ప ఆంజనేయస్వామి ఆలయంలోని బలరామ గేటు వద్ద దాదాపు 20 నిమిషాల పాటు జెండాకు పూజ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.40 నుంచి 4.15 వరకు వేడుక జరగనుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంది. సాధారణ ప్రజానీకం రాకుండా చర్యలు తీసుకోనున్నారు. జంబూ సవారీ రోజున చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టనున్నారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
400 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం
వడయార్ వంశస్థులు మొదటగా శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అయితే 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. ఆ సందర్భంగా దసరా వేడుకలు నిర్వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ.. వేడుకలు మాత్రం 400 ఏళ్లుగా నిర్విగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి.
సవారీలో భాగం కానున్న అశ్వాలు