మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారని వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం స్పందించింది. ప్రణబ్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ స్పష్టం చేశారు. తన తండ్రి మరణించినట్లు ప్రముఖ పాత్రికేయులే సామాజిక మాధ్యమాల్లోనకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
"మా తండ్రి ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. ప్రముఖ పాత్రికేయులే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయటం.. దేశంలో నకిలీ వార్తల వ్యాపారం ఎలా ఉందో అనడానికి అద్దం పడుతోంది."
- అభిజిత్ ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
ఈ వదంతులను ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కూడా ఖండించారు. "మా తండ్రి గురించి వస్తోన్న వార్తలు అవాస్తవం. నన్ను ఎవరూ సంప్రదించేందుకు ప్రయత్నించకండి. ఆసుపత్రి నుంచి మా తండ్రి సమాచారం తెలుసుకునేందుకు నేను అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది" అని శర్మిష్ఠ తెలిపారు.
హెల్త్ బులిటెన్...
ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకినట్లు సోమవారం నిర్ధరణ అయింది. అదే రోజు ఆయనకు మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. అయితే ప్రణబ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి స్పష్టం చేసింది. ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్న ఆయనకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని తెలిపింది.