తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు రుణమాఫీకి ఠాక్రే సర్కార్ హామీ- స్థానికులకు 80% ఉద్యోగాలు! - MVA govt to waive farmers' loans, ensure 80 pc jobs to locals

మహారాష్ట్ర వికాస్ అఘాడీ సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించాయి కూటమి పార్టీలు. సర్కారు ప్రాథమ్యాలను వివరిస్తూ కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేశాయి. రాజ్యాంగం ప్రవచించిన లౌకిక విలువలకు కట్టుబడి... జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీస ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి.

.MVA govt to waive farmers' loans, ensure 80 pc jobs to locals
మహారాష్ట్ర వికాస్ అఘాడీ కనీస ఉమ్మడి ప్రణాళిక విడుదల

By

Published : Nov 28, 2019, 7:14 PM IST

మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో కూటమి పార్టీలు పాలనపై దృష్టి సారించాయి. ఇందుకోసం కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించాయి. శివసేన నేత ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ ఈ పత్రాన్ని ముంబయిలో విడుదల చేశారు. మొత్తం 11 అంశాలతో కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించిన మహారాష్ట్ర వికాస్ అఘాడీ..... రైతులు, నిరుద్యోగం, మహిళలు, విద్య, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, పరిశ్రమలు, సామాజిక న్యాయం, పర్యటకం, కళలు, సంస్కృతికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది.


కష్టాల సుడిలో చిక్కుకున్న రైతుల్ని ఆదుకునే దిశగా పంటరుణాల మాఫీని అమలు చేస్తామని కనీస ఉమ్మడి ప్రణాళికలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పేర్కొన్నాయి. అకాల వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందిస్తామన్న కూటమి... పరిహారం అందించేందుకు వీలుగా పంటలబీమా పథకంలో మార్పులు చేస్తామని స్పష్టంచేసింది. పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించడం సహా, కరవు ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

మహిళా సాధికారతే లక్ష్యం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే చేపడతామని ప్రణాళికలో కూటమి స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ వర్తింపజేసేలా చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొంది. నిరుద్యోగ భృతి అందజేస్తామని తెలిపింది. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామన్న కూటమి... ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది. అన్ని నగరాలు, జిల్లా కేంద్రాలలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌లను ఏర్పాటు సహా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు గౌరవవేతనం పెంచుతామని వాగ్దానం చేసింది. మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం ఉపాధి సంఘాలను మరింత బలోపేతం చేస్తామని కూటమి స్పష్టం చేసింది.

విద్య, వైద్యం...

విద్యావ్యవస్థలో ప్రమాణాల మెరుగుదల సహా వ్యవసాయ కూలీలు, ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు చెందిన వారికి సున్నా వడ్డీకే విద్యారుణాలు అందిస్తామని తెలిపింది. ముఖ్యమంత్రి గ్రామసడక్ యోజన పథకం కింద రహదారుల అభివృద్ధి సహా మురికివాడల పునరావాస పథకం కింద అర్హులైనవారికి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొంది. ఒక రూపాయి క్లినిక్‌లను తాలూకా స్థాయిలలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దశలవారీగా అన్ని జిల్లాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్యకళాశాలలను ఏర్పాటు చేస్తామన్న కూటమి పార్టీలు...... రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చాయి.

రూ. పదికే భోజన పథకం

నూతన పరిశ్రమలను, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చర్యలు సహా ఐటీ రంగంలోకి నూతన పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా అవసరమైన సంస్కరణలను తీసుకువస్తామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న పార్టీలు.... మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం వివిధ పథకాలను తీసుకువస్తామని ప్రణాళికలో పేర్కొన్నాయి. పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపాయి. పదిరూపాయలకే భోజనం పథకాన్ని తెస్తామని వెల్లడించాయి.

కనీస ఉమ్మడి ప్రణాళిక అమలుకు రెండు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్ర మంత్రి వర్గ సమన్వయానికి ఒక కమిటీ, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయానికి మరో కమిటీ ఏర్పాటు చేస్తామని కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details