అగ్ని ప్రమాదంతో 300 ఇళ్లు దగ్ధం బుధవారం తెల్లవారుజామున బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శోఖ్పూర్లోని జాప్సీ టోలాలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 300 ఇళ్లు అగ్నికి ఆహూతయ్యాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులు పరుగులు తీశారు. ఇళ్లు పూర్తిగా దగ్ధమై వందల మంది నిరాశ్రయులయ్యారు. వస్తు సామగ్రి అగ్నికి ఆహూతవడం వల్ల బాధితుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
"అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది నిరాశ్రయులయ్యారు. 200 నుంచి 300 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఘటన ఎలా జరిగిందో తెలియదు."
-స్థానికుడు
ఖాళీ చేయించడం కోసమే...
ఇరుగుపొరుగు గొడవలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. తమను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికే కొంతమంది ఇళ్లకు నిప్పంటించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కొందరు పెద్దవాళ్లు రాజకీయనేతలతో కుమ్మక్కయి ఇళ్లకు నిప్పంటించారు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయడమే వారి లక్ష్యం. మంగళవారం కొంతమంది మమ్మల్ని బెదిరించి వెళ్లారు"-స్థానికుడు