అసోంలోని ఓ దేవాలయం హిందూ-ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 350 ఏళ్ల పురాతనమైన ఈ బిల్లేశ్వర దేవాలయంలో రోజూ జరిగే కార్యక్రమాల్లో ముస్లింలు భాగస్వాములు కావడం ఆనవాయితీగా వస్తోంది. పశ్చిమ అసోంలోని నల్బరి పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉంది ఈ బిల్లేశ్వర దేవాలయం.
"బిల్లేశ్వర దేవాలయం ఎప్పుడు నిర్మించారో కచ్చితంగా చెప్పలేను. కానీ, నాగాక్ష రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈయన నరకాసురుడికి సమకాలీనుడు."
-రంజిత్ మిశ్రా, ఆలయ పూజారి
నవరాత్రుల నేపథ్యంలో దుర్గా పూజ కోసం ఈ ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. దీంతో ఇక్కడి ముస్లిం ప్రజల్లోనూ సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇక్కడ దేవుడికి సమర్పించిన నైవేద్యంలో కొంత భాగాన్ని ముస్లింలకు పంచిపెడుతూ ఉంటారు. పండుగలు జరిగినప్పుడల్లా సమీపంలోని ముస్లింలు ఆలయ ఉత్సవాల్లో భాగమవుతుంటారు.