అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తి కలిగించలేదని, పూర్తిగా చదివిన తర్వాత పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్ వేస్తామని ముస్లిం పక్షాల తరఫు న్యాయవాది జఫర్‌యాబ్ జిలానీ చెప్పారు.
తీర్పు వెలువడిన తర్వాత ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
"తీర్పు మా అంచనాలకు తగ్గట్టు లేదు. మేం ప్రార్థనలు చేసిన మసీదు స్థలాన్ని అవతలి పక్షానికి ఇవ్వడాన్ని న్యాయంగా పరిగణించడంలేదు. మసీదు ఉందంటే అక్కడ కచ్చితంగా నమాజ్ జరిగినట్లే. నమాజ్ జరిగే స్థలాన్ని మరో మతానికి ఇవ్వడం న్యాయంగా అనిపించలేదు. మా నిబంధనల ప్రకారం మసీదును ఎవరికీ దానం, ధారాదత్తం చేయకూడదు. మసీదుకు ప్రత్యామ్నాయం లేదు. బదులుగా 500 ఎకరాలిచ్చినా విలువ ఉండదు.ఈ తీర్పు ద్వారా మా హక్కులు పోయాయి’’