తెలంగాణ

telangana

'కశ్మీర్​' నవశకానికి నాంది పడిన వేళ

By

Published : Oct 31, 2019, 10:13 PM IST

జమ్ము-కశ్మీర్ చరిత్రలో.. కొత్త శకం మొదలైంది. 72 ఏళ్లుగా ఒకే రాష్ట్రంగా ఉన్న అవిభక్త జమ్ముకశ్మీర్‌.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్‌ జయంతి సందర్భంగా ఈరోజే దేశం మొత్తం ఒకే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. లద్దాఖ్‌ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌ లేహ్‌లో.. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్‌చంద్ర ముర్ము శ్రీనగర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లుపై పలు రాజకీయపార్టీలు విమర్శలు చేయగా.. మరికొన్ని మద్దతుగా నిలిచాయి.

కేంద్రపాలిత ప్రాంతాల హోదాలో జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన కశ్మీర్​లో నవశకం మొదలైంది. లద్దాఖ్‌ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌ ఉదయం 7 గంటల 15 నిమిషాలకు లేహ్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ రాధాకృష్ణ మాథుర్‌తో ప్రమాణం చేయించారు. సింధు సంస్కృత ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, హిల్ కౌన్సిల్స్, ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ప్రజలు పాల్గొన్నారు. లద్ధాఖ్‌ పోలీసు అధిపతిగా 1995 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఎస్‌ ఖండారేని కేంద్రం నియమించింది.

లెఫ్టినెంట్ గవర్నర్​గా గిరీష్​చంద్ర ప్రమాణం

జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఈ మధ్యాహ్నమే గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. జబెర్వాన్ శ్రేణి పర్వత ప్రాంతంలోని రాజ్‌భవన్‌లో జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ రాధాకృష్ణ ముర్ముతో ప్రమాణం చేయించారు.

28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

ఆగస్టు 5న.. ఆర్టికల్ 370 రద్దు కాగా 86 రోజుల తర్వాత.. 2019-జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం బుధవారం అర్ధరాత్రి నుంచి జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌.. కేంద్ర పాలిత ప్రాంతాలుగా మనుగడలోకి వచ్చాయి. ఓ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కాగా.. రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 నుంచి 9కి చేరింది.

వారసత్వహోదా ఉపసంహరణ

జమ్ముకశ్మీర్‌ విభజన చట్టం అమల్లోకి వచ్చినందున అక్కడ రాష్ట్రపతి పాలన రద్దయింది. అలాగే ఎన్నికల కమిషన్‌ త్వరలోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టనుంది. సరిహద్దులను మార్చిన తర్వాత జమ్ముకశ్మీర్‌ శాసనసభలో 114 స్థానాలు ఉండనున్నాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌లో శాశ్వత నివాసితులు, వారసత్వ హోదాలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పునర్విభజనపై అభ్యంతరాలు!

జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్​ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని ఆరోపించింది. అయితే డ్రాగన్​ దేశ ఆరోపణలను తిప్పికొట్టింది భారత్​. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసే నిర్ణయం పూర్తి స్థాయిలో భారత అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

కశ్మీర్​ పునర్విభజనకు వ్యతిరేకంగా నేషనల్​ కాన్ఫరెన్స్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శలు గుప్పించింది. కశ్మీర్​ లోయలోనూ పలువురు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చి ప్రభుత్వం తమ ప్రత్యేక ప్రతిపత్తి, గుర్తింపును దోచుకుంటోందని ఆరోపించారు. లద్దాఖ్​లోనూ కశ్మీర్​విభజనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

అయితే కశ్మీర్​లోని భాజపా నాయకులు ఆర్టికల్​ 370 రద్దును సమర్థించారు. కశ్మీర్​ ప్రజల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details